నెల్లూరులో సీటు ఫేటు మారిపోతుందా... !
ఆనంకు ఉద్వాసన తప్పదా.. ?
ప్రస్తుతం జిల్లా నుంచి సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే, ఆయన సీనియారిటీకి తగ్గ కీలక శాఖ దక్కలేదన్న అసంతృప్తి ఆయనలో ఉందనే ప్రచారం సాగుతోంది. రాజకీయంగా కూడా ఆయన తన శాఖకే పరిమితం కావడం, జిల్లా రాజకీయాల్లో మునుపటిలా చురుగ్గా లేకపోవడంతో, ఈసారి ప్రక్షాళనలో ఆనంను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తారనే చర్చ గట్టిగా నడుస్తోంది.
రేసులో ముగ్గురు కీలక నేతలు :
జిల్లాలో ఖాళీ అయ్యే బెర్త్ కోసం ప్రధానంగా ముగ్గురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి: చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు. 2014లో ఓడిపోయినా ఎమ్మెల్సీగా మంత్రి పదవి దక్కించుకున్న సోమిరెడ్డి, ఈసారి సర్వేపల్లి నుంచి ఘన విజయం సాధించినా కేబినెట్లో చోటు దక్కలేదు. ఆయన అనుభవం దృష్ట్యా ఈసారి మంత్రి పదవి ఖాయమని అనుచరులు భావిస్తున్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి: వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన డైనమిక్ లీడర్. నెల్లూరు రూరల్ నుంచి గెలిచిన ఆయనకు మంత్రి కావాలనే ఆశ ఉంది. అయితే, ఇప్పటికే నెల్లూరు సిటీ నుంచి నారాయణ మంత్రిగా ఉండటంతో, ఒకే ప్రాంతం నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వడం కష్టమనే సమీకరణం అడ్డుగా ఉంది.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి: ప్రస్తుతం ఈమె పేరు జిల్లాలో బలంగా వినిపిస్తోంది. వైసీపీ కంచుకోట అయిన కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఓడించి ఆమె సత్తా చాటారు. సామాజిక సమీకరణాలు (రెడ్డి వర్గం), మహిళా కోటా, ఆర్థిక బలం అన్నీ ఆమెకు కలిసివచ్చే అంశాలు. వైసీపీ అడ్రస్ లేకుండా చేయాలంటే ప్రశాంతి రెడ్డికి పదవి ఇవ్వడమే సరైన వ్యూహమని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
మంత్రి పదవి 'రెడ్డి'ల మధ్యేనా.. ?
మొత్తం మీద నెల్లూరు జిల్లాలో రెండో మంత్రి పదవి రెడ్డి సామాజిక వర్గానికే దక్కేలా కనిపిస్తోంది. ఆనం స్థానంలో మరొక రెడ్డి నేతను తీసుకోవడం ద్వారా జిల్లాలో సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా చూడాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. సోమిరెడ్డి సీనియారిటీకి పట్టం కడతారా లేక వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి అవకాశం ఇచ్చి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.