బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్ మామూలుగా లేదే..!
ఆర్థిక లోటు:
ఏప్రిల్-నవంబర్ కాలంలో ఆర్థిక లోటు సుమారు రూ. 9.76 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది పూర్తి స్థాయి బడ్జెట్ లక్ష్యంలో (రూ. 15.7 లక్షల కోట్లు) 62.3 శాతానికి చేరుకుంది.
పన్నుల వసూళ్లు: ఆదాయపు పన్ను రాయితీలు, జీఎస్టీ హేతుబద్ధీకరణ వల్ల నేరుగా పన్నుల ఆదాయంపై ఒత్తిడి పడింది. నామినల్ జీడీపీ వృద్ధి రేటు కూడా అంచనాల కంటే తక్కువగా ఉండటం వల్ల పన్ను వసూళ్లలో దాదాపు రూ. 50,000 కోట్ల లోటు ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పన్ను ఆదాయం తగ్గినా, ప్రభుత్వం నిర్దేశించుకున్న 4.4% ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆర్‌బీఐ నుంచి వచ్చే రూ. 2.69 లక్షల కోట్ల భారీ డివిడెండ్ కొండంత అండగా నిలుస్తోంది. ఇది కేవలం లోటును భర్తీ చేయడమే కాకుండా, ప్రభుత్వం అదనపు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. ఈ 'నాన్ ట్యాక్స్ రెవెన్యూ' వల్ల ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకోవడం సులభతరం అవుతుంది.
అప్పుల పరిమితి & భవిష్యత్ లక్ష్యాలు :
ప్రైవేట్ పెట్టుబడులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం తన మార్కెట్ రుణాలను రూ. 14.5 లక్షల కోట్ల వద్దే పరిమితం చేయాలని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 4.0 % నుంచి 4.2 % మధ్య ఉంచడం ద్వారా స్థిరమైన వృద్ధిని సాధించాలనేది నిర్మలమ్మ టీమ్ ప్లాన్.
బడ్జెట్ 2026: ముఖ్యాంశాలు :
ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం ( 2025 చట్టం) అమలులోకి రానుంది. ఇది నిబంధనలను సరళీకృతం చేస్తుంది. రవాణా, డిజిటల్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచడం ద్వారా ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొత్త పన్ను విధానంలో 30 శాతం పన్ను పరిమితిని రూ. 35 లక్షలకు పెంచవచ్చని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. ఏదేమైనా 2026 బడ్జెట్ అనేది ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే, అభివృద్ధి చెందిన దేశం దిశగా భారత్ వేసే మరో బలమైన అడుగు అని చెప్పాలి.