కేంద్రమంత్రిగా వేమిరెడ్డి... ?
కేంద్ర కేబినెట్ విస్తరణ - టీడీపీ వ్యూహం :
వచ్చే రెండు మూడు నెలల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయనున్నారనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఎన్డీయే ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి, కూటమి బలాన్ని మరింత పెంచుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఏపీలో ఇప్పటికే టీడీపీకి రెండు మంత్రి పదవులు (రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్) దక్కాయి. అయితే, తాజా సమీకరణాల దృష్ట్యా మరో పదవిని కూడా టీడీపీకి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెడ్డి సామాజిక వర్గంపై గురి :
వచ్చే 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఏపీలో వైసీపీని మరింత బలహీనపరచడమే కూటమి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. వైసీపీకి ప్రధాన అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడం లేదా వారిని ఆ పార్టీకి దూరం చేయడంపై టీడీపీ దృష్టి సారించింది. ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న వారిలో ఒకరు బీసీ (కింజరాపు రామ్మోహన్ నాయుడు), మరొకరు కమ్మ (పెమ్మసాని చంద్రశేఖర్) సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేమిరెడ్డికి అవకాశం ఇస్తే, ఆ వర్గంలో సానుకూల సంకేతాలు వెళ్తాయని పార్టీ భావిస్తోంది.
11 ఏళ్ల తర్వాత అరుదైన అవకాశం ..?
ఒకవేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కితే, దాదాపు 11 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినట్లు అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాధాన్యత విభజన తర్వాత కొంత తగ్గిందనే అభిప్రాయం ఉంది. వేమిరెడ్డి వంటి ఆర్థికంగా బలమైన, సౌమ్యుడైన నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా లాభిస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది.