అక్కడ సక్సెస్ అయితేనే జగన్‌కు భవిష్యత్తు.. ?
ప్రస్తుతం పార్టీలోని పలువురు కీలక నేతలు ఇతర పార్టీల వైపు చూస్తుండటం వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేసింది. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే జగన్ స్వయంగా ప్రజల్లోకి రావడం తప్ప వేరే మార్గం లేదు. ఈ సారి పాదయాత్రను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. కేవలం నడక మాత్రమే కాకుండా, ప్రతి గ్రామంలో రచ్చబండ వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక సమస్యలపై ప్రజలతో నేరుగా చర్చించనున్నారు. ముఖ్యంగా యువతను, మహిళలను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూనే, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఈ యాత్రలో ప్రధాన అజెండాగా ఉండనుందని సమాచారం. ఈ యాత్ర ద్వారా వైసీపీకి సంస్థాగతంగా ఉన్న బలం ఏంటో ఫ్రూవ్ చేసుకోవాలని జగన్ కసితో ఉన్నారు.
రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదగాలంటే ప్రజల మధ్య ఉండటం ఎంత ముఖ్యమో జగన్‌కు బాగా తెలుసు. అందుకే 2029 ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి ఈ పాదయాత్రను ఒక పునాదిగా వాడుకోవాలనుకుంటున్నారు. ఈ యాత్ర రాయలసీమ నుంచి ప్రారంభమై ఉత్తరాంధ్ర వరకు సాగుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్ర ద్వారానే అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు, ఆ సెంటిమెంట్‌ను జగన్ కూడా బలంగా నమ్ముతున్నారు. ఈ యాత్ర విజయవంతమైతేనే వలస వెళ్తున్న నేతలను ఆపడం సాధ్యమవుతుంది. సామాన్య ప్రజల్లో జగన్ పట్ల ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని నిరూపించడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా ఉంటుంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి నమ్మకాన్ని మళ్లీ గెలుచుకుంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకు తిరుగుండదు.ఈ పాదయాత్ర ద్వారా కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తనకి అనుకూలంగా మార్చుకోవడంలో జగన్ ఎంతవరకు సఫలం అవుతారో వేచి చూడాలి. ఈ సుదీర్ఘ ప్రయాణం జగన్ ఓర్పుకు, నాయకత్వ పటిమకు ఒక గీటురాయిగా మారబోతోంది. రాష్ట్ర రాజకీయాల్లో తన మార్కును మళ్లీ చూపాలనే పట్టుదలతో ఉన్న జగన్, ఈ పాదయాత్రతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడటం ఆసక్తికరంగా మారింది.