గురి తప్పని మాజీ సీఎం పళనిస్వామి బాణం.. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు!

Reddy P Rajasekhar

తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఒడిదుడుకులకు లోనైన అన్నాడీఎంకేను మాజీ ముఖ్యమంత్రి  పళనిస్వామి ఇప్పుడు సమర్థవంతంగా ఏకతాటిపైకి తెస్తున్నారు. ఇండియా కూటమిని ఎదుర్కోవడమే లక్ష్యంగా చిన్న పార్టీలన్నింటినీ కలుపుకుంటూ పళనిస్వామి వేగంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఎన్డీయే కూటమిని బలోపేతం చేస్తూ, ఇతర పార్టీలను తన నాయకత్వం వైపు తిప్పుకోవడంలో ఆయన విజయం సాధిస్తున్నారు. తాజాగా మరో రెండు పార్టీలు పళనిస్వామి నాయకత్వానికి మద్దతు ప్రకటించి కూటమిలో చేరడం అన్నాడీఎంకే రాజకీయ బలాన్ని మరింత పెంచింది.

తమిళనాడు ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే పీఎంకే, ఏఎంఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, పురచ్చి భారతం, జాన్ పాండియన్, ఫార్వర్డ్ బ్లాక్, పుతియా నీతి పార్టీ మరియు ఐజేకే వంటి పార్టీలు చేరాయి. ఇదే సమయంలో, కొంగు ప్రాంతంలో కీలకమైన కొంగు ప్రోగ్రెస్ పార్టీ, కొంగునాడు ప్రోగ్రెస్ పార్టీలు తాజాగా అన్నాడీఎంకేకు తమ మద్దతు ప్రకటించాయి. ఈ రెండు పార్టీల నేతలు సేలంలో పళనిస్వామిని కలిసి మద్దతు లేఖలను అందజేయడంతో, గత ఎన్నికల తరహాలోనే కొంగునాడు ప్రాంతం మళ్ళీ అన్నాడీఎంకేకే అండగా నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి.

సినీ నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశంతో తమిళనాడులో ప్రధాన పార్టీల మధ్య పోటీ అత్యంత రసవత్తరంగా మారింది. గెలుపోటముల మధ్య స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉండే అవకాశం ఉండటంతో, ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని అన్నాడీఎంకే, డీఎంకే వంటి ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే నాయకత్వం పుతియా తమిళగమ్, డీఎండీకే పార్టీలతో సంప్రదింపులను వేగవంతం చేయగా, ఆ రెండు పార్టీలు దాదాపుగా అన్నాడీఎంకే కూటమిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, డెల్టా ప్రాంతంలో గణనీయమైన ప్రభావం ఉన్న తమిళ దేశం పార్టీ ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేకు తమ మద్దతు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: