తాను చనిపోతూ ఐదుగురికి పునర్జన్మ ఇచ్చిన ' నాయుడు మధుశ్రీ '
- నలుగురికి నేత్రదానం
- ముగిసిన వివాహిత ఆత్మహత్య కథనం
- ( ఇండియా హెరాల్డ్ ప్రతినిధి - గోదావరి ) :
అవయవదానంతో ఐదుగురుకి పునర్జన్మ ప్రసాదించి ఒక వివాహిత మృతి చెందింది. అవయవాలతో పాటు నేత్రదానం సైతం చేసి నలుగురికి వెలుగులు నింపిన ఒక మహిళ కథ ఇది. మృత్యువుతో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లినా తాను సజీవంగా ఉండటం కోసం వారి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని అనేకమంది గొంతెత్తి నినదిస్తున్నారు. వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నాయుడు మధుశ్రీ ఈనెల 8వ తేదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రైవేటు హాస్పిటల్కు, అక్కడనుండి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే మెడకు ఉరి బాగా బిగుసుకుపోవటంతో బ్రెయిన్ డెడ్ అయిందని ప్రాణంతో బయటపడటం సాధ్యం కాదని వైద్యులు నిర్ధారించారు.
మధు శ్రీ బ్రెయిన్ డెడ్ అయిందని తెలియడంతో దుఃఖ సమయంలో తల్లిదండ్రులు డొంకిన సత్యనారాయణ, రాధా దంపతులు, భర్త దుర్గారావు, మేనమామలు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధుసూదన్ రావు, వంశీ మరియు వారి కుటుంబ సభ్యులంతా అవయవ దానం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని గుంటూరు కిమ్స్ శిఖర ఆసుపత్రి వారికి తెలియజేయడంతో విజయవాడ నుండి మధుశ్రీని వారి ఆసుపత్రికి తీసుకువెళ్లి పలు పరీక్షలు నిర్వహించారు. కిమ్స్ ఆస్పత్రి న్యూరాలజిస్ట్ ప్రదీప్ కుమార్ రెడ్డి , న్యూరో సర్జన్ చిట్టెం లక్ష్మణ్, జీవన్ దాన్ మరియు ప్రభుత్వం వారు సంయుక్తంగా మధుశ్రీ అప్నియా APNEA టెస్ట్ నిర్వహించడంతో పాజిటివ్ రావడంతో 16వ తేదీ బ్రెయిన్ డెడ్ అని నిర్ణయించారు.
మధు శ్రీ ఊపిరితిత్తులను చెన్నై అపోలో ఆసుపత్రికి, గన్నవరం పిన్నమనేని సిద్ధార్థ హాస్పటల్లో లివర్ మరియు మూత్రపిండం, గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్ లో లివర్ మరియు మూత్రపిండం లను ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అమర్చి వారికి నూతన జీవితాలను ప్రసాదించినట్లు కిమ్స్ శిఖర ఆసుపత్రి యాజమాన్యం వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం మధు శ్రీ మృతదేహం వద్ద కిమ్స్ హాస్పటల్ సూపర్డెంట్ డాక్టర్ కే వినోద్, డాక్టర్ హరి కుమార్ నేతృత్వంలో పలువురు డాక్టర్లు, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జంగారెడ్డిగూడెం తహసిల్దార్ స్లీవ జోజి, ఎస్ఐ కుటుంబరావు లు గుంటూరు ఆసుపత్రికి వచ్చి శవ పంచనామా నిర్వహించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తాము దుఃఖంలో ఉండి కూడా మరొకరికి ప్రాణదానం చేయాలనే సంకల్పంతో అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యుల త్యాగం నేటి ప్రపంచానికి ఆదర్శనీయమని కొనియాడారు. శోకసంద్రంలో ఉండి కూడా మధుశ్రీ సజీవంగా ఉండటం కోసం ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించిన కుటుంబ సభ్యుల నిర్ణయం వారిలో ఉన్న మానవీయ కోణాన్ని చాటి చెప్తుందన్నారు. మధు శ్రీ ఆత్మకు శాంతి కలగాలని కోరారు. మధుశ్రీ వైద్య విషయంలో సహకరించిన కిమ్స్ హాస్పటల్ హెడ్ ఎన్ వి హరి కుమార్, డాక్టర్ సంజీవ్ మరియు వైద్య బృందానికి, పోలీసు మరియు రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మిత్రులకు మధుశ్రీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నాయుడు మధుశ్రీ కి భర్త దుర్గారావు, కుమారుడు బన్విత్ (5) కుమార్తె త్రిషిక (2.9) ఉన్నారు.