ఏపీ: డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. టిడిపి ఎమ్మెల్యే కుమారుడు సంచలన వ్యాఖ్యలు..!

Divya
ఈ మధ్యకాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూటమినేతల మధ్య సఖ్యత కనిపించడం లేదు. కొంతమంది నేతల తీరు కూడా సరిగ్గా లేదని ఇప్పటికే అధిష్టానం కూడా హెచ్చరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా తిరుపతి జిల్లాలో మరోసారి రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు నారాయణవనం, జడ్పిటిసి సభ్యులు సుమన్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలలో తాము గెలవడానికి భారీగా ఖర్చు చేశామని, ఆ డబ్బులు తిరిగి ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామంటూ ఒక సంచలన ప్రకటన ప్రకటించారు.



సత్యవేడు నియోజకవర్గంలో తాము 40 వేల మెజారిటీతో గెలిచామని సుమన్ తెలియజేశారు. గత ఎన్నికలలో తాము ఎంతో కష్టపడి ఖర్చు చేసి మరి సీటు గెలుచుకున్నామని తాము పెట్టిన ఖర్చు తిరిగి ఇస్తే చాలని వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామంటూ తెలియజేశారు. తన తండ్రి ఆదిమూలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కుమారుడు సుమన్ తెలియజేశారు. తమ పార్టీ తమ కుటుంబాన్ని గౌరవించడం లేదని, గౌరవం లేని చోట పార్టీలో కొనసాగించాల్సిన పనిలేదంటూ మాట్లాడారు.


ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన సత్యవేడులో ఒక అగ్రవర్ణ వ్యక్తి ని ఇన్చార్జిగా ఎలా నియమిస్తారంటూ సుమన్ ప్రశ్నించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఈ సత్యవేడులో అమలు లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. సత్యవేడు సిఐ పైన సుమన్ ఆరోపణలు చేస్తూ రోజు ఇసుక, గ్రానైట్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారంటూ పలు రకాల ఆరోపణలు చేశారు. అలా అక్రమాలు చేస్తున్న వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని సస్పెండ్ చేయలేదని ఫైర్ అయ్యారు. తన తండ్రి పై తమ సొంత పార్టీ నాయకులే కుట్రలు చేస్తున్నారని పలు రకాల ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కుమారుడు సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ అంతట చర్చనీ అంశంగా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: