ఎడిటోరియల్ : మూడో వికెట్ డౌన్.. టిడిపిలో కొత్త ట్రెండ్

Vijaya

తెలుగుదేశంపార్టీలో కొత్త ట్రెండుకు తెరలేచింది. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఖరారైన తర్వాత పోటీనుండి తప్పుకోవటం. ఐదేళ్ళు ఎంఎల్ఏలుగా అన్నీ అధికారాలను అనుభవించి బాగా ఆస్తులు సంపాదించుకున్నారు.  తీరా ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత పోటీనుండి తప్పుకోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఎంఎల్ఏలు ఈ విధంగా పోటీ నుండి తప్పుకోగా తాజాగా మరో ఎంఎల్ఏ కూడా పోటీ చేయటం లేదని స్పష్టంగా చెప్పేశారట.

 

కర్నూలు జిల్లాలోని బనగానపల్లి ఎంఎల్ఏ బిసి జనార్ధన్ తాజాగా పోటీనుండి తప్పుకుంటున్నట్లు నాయకత్వానికి చెప్పారు. ఒక్కొక్కళ్ళుగా పోటీనుండి తప్పుకుంటుండటంతో చంద్రబాబునాయుడులో ఆందోళన పెరిగిపోతోంది. ఒకవైపు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు టికెట్లు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా తప్పుకుంటున్నారు. టికెట్ల కోసం పోటీ పడటం, అధినేతపై ఒత్తిళ్ళు పెట్టటం ఎక్కడైనా జరిగేదే. కానీ టికెట్లు ఖరారైన తర్వాత నామినేషన్లు వేసే ముందు పోటీనుండి ఎందుకు తప్పుకుంటున్నట్లు ?

 

ఎందుకంటే, అభ్యర్ధులు కూడా తమ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోటములపై సర్వేలు చేయించుకుంటున్నారు. ఆ సర్వేలో పార్టీపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. అదే సమయంలో గ్రౌండ్ రిపోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డికి జనాల ఆధరణ స్పష్టంగా కళ్ళకు కనబడుతోంది. దాంతో గెలవమని తెలిసీ పోటీచేసి కోట్ల రూపాయలు తగలేసుకోవటం ఎందుకని పోటీనుండి తప్పించుకుంటున్నారు.

 

నెల్లూరు రూరల్ అభ్యర్ధిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇలాగే పోటీ నుండి తప్పుకుని వైసిపిలో చేరిపోయారు. అలాగే, మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా ఒంగోలు ఎంపిగా పోటీ చేయలేనని చెప్పి వైసిపిలో చేరిపోయి అక్కడి నుండి పోటీ చేస్తున్నారు. తర్వాత కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఫిరాయింపు ఎంఎల్ఏ బుడ్డా రాజశేఖర్ రెడ్డి, తాజాగా బనగానిపల్లి ఎంఎల్ఏ బిసి జనర్ధన్ రెడ్డ పోటీనుండి తప్పుకున్నారు. వీళ్ళ నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న నేతల్లో చాలామంది వైసిపిలో చేరిపోవటంతో టిడిపి గెలుపు అవకాశాలు దెబ్బతినేశాయట.

 

టికెట్లు ఖరారైన వాళ్ళు కూడా పోటీనుండి తప్పుకోవటమంటే పార్టీ పరిస్ధితేంటో స్పష్టంగా అర్ధమైపోతోంది. చంద్రబాబు చెబుతున్నదానికి పూర్తి వ్యతిరేకంగా క్షేత్రస్ధాయి పరిస్ధితులున్నాయి.  ఈ విషయం అందరికీ అర్ధమైపోతోంది.  చంద్రబాబుకు కూడా స్పష్టంగా అర్ధమైపోతోంది పరిస్దితులు. కాకపోతే నేతల మొరేల్ దెబ్బతినకుండా గెలుపు మనదే అంటూ మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్నారు. చూద్దాం పోలింగ్ తేదీ దగ్గరలోకే వచ్చేస్తోంది కదా. జనాలు ఏం చేస్తారో ?

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: