మాయమైన, మహిళల కేసులపై పోలీసులు ఏం చేస్తున్నారో తెలుసా?

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్‌ ఉదంతం పోలీసు శాఖలో కదలిక తెచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన తప్పిపోయిన కేసులన్నీ ఒక కొలిక్కి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జిల్లాల వారీగా నమోదైన కేసు లన్నింటినీ బూజు దులుపటం మొదలైంది.  అందులోనూ మరీ ముఖ్యంగా పిల్లలు అదృశ్యమైన కేసులకు ప్రాధాన్యం ఇవ్వ నున్నారు. తప్పిపోయి కేసు నమోదైనప్పుడు దాన్ని పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలనూ సమీక్షించ నున్నారు. 


కొత్తగా నమోదయ్యే కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారిస్తూనే పాత కేసులనూ కొలిక్కి తేవాలని నిర్ణయించారు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో వెలుగు చూసిన వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తమ పిల్లలు తప్పిపోయారని పోలీసు లకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. 

తప్పిపోయి ఆ తర్వాత శవమై తేలిన శ్రావణి విషయంలో గ్రామస్థులైతే పోలీసులపై తిరుగుబాటు చేశారు. తమ పిల్లలు తప్పిపోయారని ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లిన ఎవరికై నా ఇంచుమించు ఇదే తరహా అనుభవం ఎదురవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంచుమించు ఏటా 13 వేల మందికిపైగా తప్పిపోతున్నారు. ఇందులో మూడు వేల మంది వరకు పిల్లలు ఉంటున్నారు. తప్పిపోయిన వారిలో పదివేల మంది వరకూ ఆచూకీ లభిస్తోంది. మిగతావారు ఏమవుతున్నారన్నది ప్రశ్న. 

పెద్దలైతే ఎక్కడో ఒక దగ్గర కొంతవరకైనా క్షేమంగా ఉంటారనే భరోసా ఉంటుంది. కానీ పిల్లల విషయంలోనే అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల అక్రమ రవాణా ముఠాల కు చిక్కి వ్యభిచార గృహాల్లో తేలుతున్నారనే వాదన ఉంది. గతేడాది యాదగిరిగుట్టలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేసినప్పుడు 16మంది పిల్లల్ని కాపాడారు. తాజాగా ధర్మపురిలోనూ నలుగురు పిల్లల్ని కనుగొన్నారు. ఇలాంటివి బయటపడ్డప్పుడు తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. 

హాజీపూర్‌ ఘటన ప్రజలనే కాదు పోలీసులను కూడా కదిలించి వేసింది. పిల్లలు తప్పిపోయినట్లు ఫిర్యాదు రాగానే సరిగా స్పందించకపోతే పర్యవసానం ఎలా ఉంటుందో ఈ ఘటన ద్వారా వెల్లడైంది. దీంతో ఇక ముందైనా ఇలాంటివి జరగకుండా చూసేందుకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మిస్సింగ్‌ కేసుల దర్యాప్తు పూర్తి చేసేందుకు నడుం బిగించారు. తొలుత గత నాలుగు నెలలుగా నమోదైన కేసులను బయటకు తీసి వాటిపై దృష్టి సారించనున్నారు. అందులోనూ పిల్లలకు సంబంధించిన కేసులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: