తండ్రి క‌ల వ‌ద్ద‌కు జ‌గ‌న్‌...పోల‌వ‌రం ప్రాజెక్టులో సంచ‌ల‌న నిర్ణ‌యాలు ఖాయ‌మే

Pradhyumna
ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ప్ర‌జానికం కోసం త‌న తండ్రి త‌ల‌పెట్టిన భ‌గీర‌థ య‌జ్ఞం వ‌ద్ద‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అడుగుపెట్ట‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ద‌శ‌ను మార్చే పోలవరం ప్రాజెక్టును గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు... మూడు గంటల పాటు సీఎం జగన్ సంద‌ర్శించ‌నున్నారు. క్షేత్రస్థాయిలో తొలి సారి పనులు పరిశీలించనున్న సీఎం... పోలవరంలో ఇరిగేషన్ పనులతో పాటు పునరావాసంపై ప్రత్యేక దృష్టి సారించనుండ‌టంతో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.


పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అమరావతి, పోలవరం నిర్మాణాల్లో 'సెన్సేషనల్‌ స్కామ్‌' జరిగిందని ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్ట‌డానికి కొద్దిరోజుల ముందు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.  'ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌'తో వేల కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే పోలవరం నిర్మాణం జరాగాల్సిన అవసరం లేదన్న జగన్.. పోలవరం టెండర్లలో కుంభకోణం జరిగి ఉంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రివర్స్ టెండర్ విధానంలో తక్కువ రేట్లకు పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ప్రజలకు పరిహారం ఇవ్వకుండా నీళ్లు నిలపడం సరికాదనే అభిప్రాయంలో జగన్ సర్కార్ ఉంది. ఇరిగేషన్ పనులు - పునరావాసం పనులు సమాంతరంగా జరగాలంటున్న వైసీపీ ప్రభుత్వం... ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూ పరిహారంలో అవకతవకలు జరిగాయన్న భావనలో ఉంది. పోలవరం కేంద్రానికి అప్పగించాలా...? రాష్ట్రం ద్వారానే నిర్మాణం చేపట్టాలా? అనే అంశంపై కూడా విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.


ఏపీ ద‌శ‌ను మార్చే ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని అన్ని వ‌ర్గాలు భావిస్తున్న త‌రుణంలో...పోలవరం కాంట్రాక్టర్‌ల విషయంలో సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారనే ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు అనూహ్యంగా పెరిగిపోవ‌డంపై ప్రత్యేక దృష్టి పెట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెప్తున్నారు. ప్రాజెక్టు పూర్త‌వ‌డం, నిధుల ప‌రంగా పూర్తి పార‌ద‌ర్శ‌క విధానాల‌కు పెద్ద‌పీట వేసేలా ఈ నిర్ణ‌యం ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: