బెంజ్‌ స్పీడ్‌లో బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులు..

DRK Raju
బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనులు 97శాతం పూర్తయ్యాయి. ఈ  నెలాఖరుకు ఫ్లై ఓవర్‌ పనులను  పూర్తి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌ గా తెలుస్తుంది.  అక్టోబరులో నగర ప్రజలకు అంకితం చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలో   సర్వాంగ సుందరంగా మూడు వరుసల వయాడక్ట్‌ కాంక్రీట్‌ లేయర్‌పై బీటీ లేయర్‌ పనులు జరుగుతున్నాయి. క్రాష్‌ బ్యారియర్స్‌కు రంగులతో సొబగులు అద్దుతున్నారు. ఎస్వీఎస్‌ జంక్షన్‌ దగ్గర అప్రోచ్‌ పూర్తయ్యే నాటికి వయాడక్ట్‌ ఫినిషింగ్‌ పనులను కూడా పూర్తిచేసే దిశగా బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ పనులు జరుగుతున్నాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, దుర్గా ఫ్లై ఓవర్ల మాదిరిగా కాకుండా బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ మీద కాంక్రీట్‌ లేయర్‌పై మళ్లీ దృఢమైన బీటీ లేయర్‌ వేస్తున్నారు. ఈ లేయర్‌ వల్ల వాహనదారులకు అసౌకర్యం ఉండదు. సాధారణ కాంక్రీట్‌ లేయర్‌పై కుదుపులు ఉంటాయి. బీటీ లేయర్‌ మీద వాహనాలు వెళితే కుదుపులు ఉండవు. జాయింట్స్‌ దగ్గర కూడా వాహనాలు అదరకుండా ఉండేటా బీటీ లేయర్‌ పనులు చేపడుతున్నారు.



కాంక్రీట్‌ లేయర్‌పై బీటీ లేయర్‌ పనులను కాంట్రాక్టు సంస్థ వినూత్నంగా చేపడుతోంది. కాంక్రీట్‌ లేయర్‌పై గమ్‌ను పూస్తోంది. ఈ గమ్‌పై నల్లటి రంగులో ఉన్న ఆస్‌బెస్టాస్‌ షీట్లను అతికిస్తోంది. ఇలా అతికించిన షీట్లపై బీటీ లేయర్‌ పనులను చేపడుతున్నారు. దాదాపు అయిదారు అంగుళాల మందంతో బీటీ లేయర్‌ పనులు చేపడుతున్నారు. రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ దగ్గర పూర్తి చేసిన అప్రోచ్‌ దగ్గర నుంచి బీటీ లేయర్‌ పనులను ప్రారంభించారు. ఈ పనులు నిర్మలా జంక్షన్‌ వరకు చేరుకున్నాయి. మిగిలిన భాగంలో ఆస్‌బెస్టాస్‌ షీట్లను అతికించారు. ఈ భాగంలో బీటీ లేయర్‌ పనులు మరో వారంలో పూర్తి చేయనున్నారు. బీటీ లేయర్‌ పనులు పూర్తి చేయటానికి రెండు రోడ్డు రోలర్లు, ఒక పెద్ద బీటీ లేయర్‌ మిక్సర్‌ వాహనాన్ని ప్రస్తుతం ఫ్లై ఓవర్‌ వయాడక్ట్‌ ఎక్కించారు.




బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు, వయాడక్ట్‌కు రెండువైపులా క్రాష్‌ బ్యారియర్స్‌ నిర్మాణ పనులు చేపట్టారు. క్రాష్‌ బ్యారియర్స్‌ అంటే సైడుగోడలు. పిల్లర్ల మధ్యన ఈ క్రాష్‌ బ్యారియర్స్‌ దగ్గర కొన్ని చోట్ల గ్యాప్‌లున్నాయి. ఈ గ్యాప్‌ల దగ్గర రెడీ మిక్స్‌తో కాంక్రీట్‌ పనులను మరోవైపు చేపట్టారు.
 ఫ్లై ఓవర్‌పై ఒక పక్క బీటీ లేయర్‌ పనులు జరుగుతుండగా, ఇంకో వైపు ఫ్లై ఓవర్‌ పై భాగంలోనే లైటింగ్‌ పోల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఫ్లై ఓవర్‌ క్రాష్‌ బ్యారియర్స్‌కు రంగులు వేస్తున్నారు. సింగిల్‌ ఫ్లై ఓవర్‌ పై రాకపోకలకు అనుమతించాలని అధికారులు భావిస్తున్న తరుణంలో ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు దాదాపు కనిపించటం లేదు.




ఈ ఫ్లై ఓవర్‌ సింగిల్‌ అయినప్పటికీ మూడు వరసలతో ఉంది. కింద నుంచి చూస్తే చిన్నగా కనిపించినా ఫ్లై ఓవర్‌ చాలా విశాలంగా ఉంది. అదనంగా మరో వరుస ఉండటం వల్ల వాహనాలు ఫ్రీగా రాకపోకలు సాగించటానికి అవకాశం ఉంది. ఫ్లై ఓవర్‌ కింద భాగంలో వయాడక్ట్‌పై పడే వర్షపు నీటిని కిందికి మళ్లించటానికి వీలుగా పై నుంచి పిల్లర్ల మీదుగా కిందకు వాటర్‌ పైప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి పిల్లర్‌ దిగువ భాగంలో మొక్కలు పెంచటానికి వీలుగా పిల్లర్‌ చుట్టూ ఎర్త్‌ ఫిల్‌ చేయటానికి వీలుగా చిన్నపాటి గోడలను నిర్మిస్తున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: