చాలా రోజుల తర్వాత మళ్లీ జగన్ నోట ఆ మాట..?

Chakravarthi Kalyan

ఏపీ సీఎం వైఎస్ జగన్ నోట మళ్లీ ఆ మాట వినిపించింది. ఎన్నికలకు ముందు జగన్ నోట పదే పదే వినిపించిన ప్రత్యేక హోదా మాట మళ్లీ తాజాగా వినిపించింది. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ కోరారట. రాష్ట్ర విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, ప్రత్యేక హోదా ఇస్తే సమస్యలను అధిగమించగలమని జగన్‌ అన్నారట.


ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం ఆర్థిక సమస్యలను అధిగమించగలమని జగన్ చెప్పారట. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కాకుండా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడాలంటే ప్రత్యేక హోదా ఉండాలన్నారు. విభజన సమయంలో 22,948.76 కోట్లు రెవెన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ ఇంకా రూ.18,969.26 కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉందని, తక్షణమే ఆ నిధులను విడుదల చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు.


అయితే ప్రత్యేక హోదాపై జగన్ సీఎం అయిన నాటి నుంచి పెద్దగా మాట్లాడటం లేదు. దానికి కారణం ఉంది. జగన్ కు 22 ఎంపీ సీట్లు వచ్చినా.. వాటి అవసరం బీజేపీకి ఏమాత్రం లేదు. జగన్ సీఎం అయన వెంటనే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ప్రత్యేక హోదా విషయంలో అడగడం తప్ప ఏమీ చేయలేమని జగన్ గతంలోనే చెప్పారు. కాకపోతే వెళ్లినప్పుడల్లా ఆ విషయాన్ని గుర్తు చేయడం మంచిదని భావిస్తున్నారు.


ప్రత్యేక హోదాతో పాటు ఏపీలో పారిశ్రామికాభివృద్ధి కోసం కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం అంశాన్ని, రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్ని సీఎం వైయస్‌ జగన్‌ కేంద్రమంత్రి అమిత్‌షా వద్ద ప్రస్తావించారు. విశాఖ – చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడర్, కాకినాడలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుల పూర్తికి నిధులను సమకూర్చాల్సిందిగా కోరారు. పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: