రెండేళ్ల పాలన.. సీనియర్లకు షాక్..జూనియర్లకు ఓకే..!

Chakravarthi Kalyan
ప్రధానిగా మోడీ రెండేళ్లపాలన పూర్తయింది. మొట్టమొదటి సారి పార్లమెంటులోకి ఏకంగా ప్రధాని హోదాలోనే అడుగుపెట్టిన అరుదైన నాయకుడు ఆయన. ముఖ్యమంత్రిగా సీనియరే అయినా పార్లమెంటు ఆయనకు బొత్తిగా కొత్త. అందుకే మొదట్లో మోడీ సీనియర్ మంత్రులపై ఎక్కువగా ఆధారపడ్డారు. ఈ రెండేళ్లలో ఆయన ఆయన ఎంతో నేర్చుకున్నారు.

కేంద్రంలోని వ్యవస్థలను త్వరితగతిన అర్థం చేసుకొని మాస్టర్‌గా తయారయ్యారు. అందుకే మొదట్లో సీనియర్‌ మంత్రులను పక్కన పెట్టుకుని పాలన నడిపించిన మోడీ ఇప్పుడు జూనియర్‌ మంత్రులను ప్రోత్సహిస్తున్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లాంటి నేతలందరినీ పక్కన పెట్టి పీయూ్‌షగోయల్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, నిర్మలా సీతారామన్‌, దేవేంద్ర ప్రధాన్‌లాంటి మంత్రులు ఎదిగేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. 

మోడీ.. అసలు సిసలు రాజకీయం.. 



రాజకీయ వైకుంఠపాళి ఆటలో మోడీది అందె వేసిన చెయ్యే. అందుకే ఎవరిని ఎక్కడ ఉంచాలో .. ఎక్కడ ఉంచకూడదో మోడీకి బాగా తెలుసు.. అందుకే బీజేపీ సీనియర్లలో అసంతృప్తిని కనిపెట్టిన మోదీ వాళ్లను పక్కన పెట్టడమే కాకుండా ఎదగాలన్న వాళ్ల ఆలోచనలకు కూడా నయానో, భయానో సంకెళ్లు వేశారు. ఉదాహరణకు.. కుమారుని అరాచకాలను తెరపైకి తెచ్చి రాజ్‌నాథ్‌ సింగ్ ను కట్టడి చేశారు. 

అరుణ్‌జైట్లీ వంటి సీనియర్లను కూడా ప్రస్తుతం మోడీ పట్టించుకునే పరిస్థితి లేదు. మొదట కొన్ని నెలలు సీనియర్లు చెప్పినట్లు విన్నట్లు నటించినా తరువాత వారి అవసరం లేనంతగా వ్యవస్థలన్నింటినీ తన చెప్పు చేతల్లోకి తెచ్చుకొన్నారు. ఆయా మంత్రిత్వశాఖల సంయుక్త కార్యదర్శుల స్థాయి అధికారులతోనే.. వారిని పేరుపెట్టి పిలిచి మరీ నేరుగా మాట్లాడి పనుల గురించి ఆరా తీస్తున్నారంటే ఆయన ఏ స్థాయిలో చొచ్చుకుపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. దటీజ్ మోడీ..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: