ఈ వీక్ ఎండ్ లో భారీ విధ్వంసానికి ఐసిస్ కుట్ర...!!

Shyam Rao
ముష్కరులు ఈ వారాంతంలోనే హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నారా? గురు, శుక్రవారాల్లో బాంబుల్ని తయారు చేసి, శని, ఆదివారాల్లో పేలుళ్లకు పథకం రచించారా? పాతబస్తీతోపాటు సికింద్రాబాద్‌లోని ప్రార్థన స్థలాలు.. ఐటీ కారిడార్‌లోని మాల్స్.. నగరంలోని జనసమ్మర్థ ప్రాంతాలను టార్గెట్ చేశారా? ఔననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వర్గాలు.  కొద్దినెలల క్రితం పారిస్‌, బ్రస్సెల్స్‌లో జరిగిన విధ్వంసం తరహాలో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం కలగజేయాలనేదే వీరి ప్రధానలక్ష్యం. వీరికి సిరియా నుంచి సాంకేతిక సహకారం అందినట్టు పక్కా సాక్ష్యాలు లభించడంతో ఎన్‌ఐఏ అధికారులు ఐదుగురిని అరెస్ట్‌చేశారు. దేశంలోనే తొలిసారిగా భారీస్థాయిలో జరగబోయే నష్టాన్ని అడ్డుకున్నామని ఎన్‌ఐఏ వర్గాలు పేర్కొన్నాయి.


జులై మొదటివారంలోనే తమ ప్రణాళిక అమలు చేయాలనుకున్న ఈ ముఠా.. శని, ఆదివారాల్లో సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బాంబులు పేల్చాలని భావించారు. బ్రస్సెల్స్‌ విమానాశ్రయంలో పేలుళ్లకు ఉపయోగించిన ‘టైసిటోన్‌ ట్రైపెరాక్సైడ్‌’(టీఏటీపీ) లాంటి మిశ్రమంతో బాంబులు తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, అసిటోన్‌, యూరియా తదితరాలను ఉపయోగించి చేసే టీఏటీపీ మిశ్రమాన్ని తయారు చేసిన 48గంటల్లోనే ఉపయోగించాలి. లేదంటే అది నిర్వీర్యమవుతుంది. అందుకే ఎప్పుడు పేల్చాలో నిర్ణయించుకుని అంతకు ముందు రోజే బాంబులు తయారు చేయాలని భావించారు. ఒక్కోటి సుమారు 20 కిలోల బరువైన బాంబులు మూడు తయారు చేయాలనేది ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్న మహ్మద్‌ ఇబ్రహీం యజ్దానీ ఆలోచన.


హైదరాబాద్‌తోపాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించడానికి సిద్ధమైన ఏయూటీ మాడ్యుల్ అందుకు అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్థానికంగానే సమకూర్చుకున్నాయి. పాతబస్తీలోని వివిధ మెడికల్ షాపులు, ఫెర్టిలైజర్స్ దుకాణాలు, వాచ్‌షాపులతో పాటు ఇతర దుకాణాల నుంచి తమకు అవసరమైన సామగ్రిని సమీకరించుకున్నారు. యూరియా, పంచదార, మినరల్ యాసిడ్, ఎసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, మూడు లీటర్ల పెయింట్ కొనుగోలు చేసిన ముష్కరులు.. వాటితో బాంబులు తయారు చేసేందుకు అవసరమైన ఉపకరణాలను సిద్ధం చేసుకున్నారు.


ఐఎస్ అనుబంధ ఉగ్రవాదుల కుట్రను ఛేదించడంలో రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) కీలకంగా వ్యవహరించింది. కుట్రకు సరిగ్గా 2 నెలల కిందట ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా అనుమానాస్పద మేసేజ్‌లు చక్కర్లు కొట్టాయి. దాంతో అనుమానం వచ్చిన ‘రా’ అధికారులు వాటిపై దృష్టిసారించారు. వెంటనే ఆ ఖాతాల ఫేస్‌బుక్ అకౌంట్‌తో పాటు పాస్‌వర్డ్‌లను హైదరా బాద్‌కు పంపించారు. అలా పంపిన వాటి ద్వారా నిత్యం చాటింగ్ చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించి ఇతర నిఘా సంస్థలను హెచ్చరించారు. రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు అనుమానితులను గుర్తించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. అనుమానిత కదలికలపై పక్షం రోజులుగా నిఘా వేశారు. ఉగ్రకుట్ర భగ్నం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: