జర్మనీ పై ఉగ్ర పంజా..షాపింగ్ మాల్‌లో ఉగ్రవాదుల కాల్పులు...!!

Shyam Rao
జర్మనీపై ఉగ్రవాదులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. శుక్రవారం మ్యూనిక్‌ నగరంలో మూడు చోట్ల కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 15 మందికి పైగానే మరణించినట్టు అనుమానిస్తున్నారు. అయితే కనీసం 6 మంది చనిపోయి ఉండొచ్చని, పది మంది గాయపడ్డారని జర్మనీ పోలీసులు తెలిపారు.తుది వార్తలు వచ్చేటప్పటికి ఉగ్రవాదులు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఎంతమంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారన్నది స్పష్టం కాలేదని.. ముగ్గురు వేర్వేరు ఉగ్రవాదులను చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు.



స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు) భారీగా ఆయుధాలు ధరించిన వ్యక్తి మాల్‌లోకి వచ్చి కనిపించిన వారిపై ఇష్టానుసారం కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. తొలుత మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ దగ్గర కాల్పులు మొదలయ్యాయని చెప్పారు. కాల్పులు జరిపిన తర్వాత ఒక ఉగ్రవాది సమీపంలోని మెట్రో స్టేషన్ దిశగా పారిపోవటంతో ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి గాలిస్తున్నారు. మెట్రో స్టేషన్ సమీపంలో కూడా కాల్పుల శబ్దం వినిపించినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పటంతో మ్యూనిక్‌నగరంలో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. షాపింగ్ సెంటర్‌ను చుట్టుముట్టారు.



 ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. సంఘటన స్థలంలో ప్రజలు ఆందోళనతో పరుగులు తీస్తూ కనిపించారు. ఇళ్లలోనే ఉండాలని, బహిరంగ స్థలాల్లోకి రావొద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ఉగ్రవాదుల జాడ ఇంకా తెలియరాలేదని, ఎవరి భద్రత వారే చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఉగ్రదాడేనని పోలీసులు ధ్రువీకరించారు. జర్మనీలో స్థానిక రైలులో ఒక శరణార్థి గొడ్డలి, కత్తితో తోటి ప్రయాణికులను గాయపపరిచిన కొద్ది రోజుల్లోనే ఈ కాల్పులు జరగటం గమనార్హం. పొరుగున్న ఉన్న ఫ్రాన్స్‌, బెల్జియంలలో భీకర ఉగ్రదాడులు ఇటీవలికాలంలో జరుగుతున్నప్పటికీ జర్మనీలో జరగడం మాత్రం ఇదే ప్రథమం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: