30గంటలైనా దొరకలేదు.. ఆందోళన లో అధికారులు..!!

Shyam Rao
అదృశ్యమైన ఏఎన్ 32 విమానం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని కోస్ట్గార్డ్ ఐజీ రాజన్ తెలిపారు. శనివారం చెన్నైలో ఆయన మాట్లాడుతూ...అండమాన్కు 144 నాటికల్ మైళ్ల దూరంలో ఈ విమానం పడిపోయి ఉండవచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు. సదరు విమానం కోసం జలాంతర్గామి, 12 నౌకలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు రాజన్ బర్కోత్రా వివరించారు.  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 విమానం గల్లంతై 30 గంటలు దాటింది. ఇంతవరకు దాని ఆచూకీ లభించలేదు. 



చెన్నైకి 280 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిందని భావిస్తున్నా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి జాడ దొరకలేదు. మరోవైపు తుపానో, మరో ప్రకృతి వైపరిత్యమో విమానం కూలడానికి కారణం కాకపోయి ఉండవచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తమిళనాడులోని తాంబరంలో పరిస్థితి టెన్షన్ టెన్షన్‌గా ఉంది. అక్కడున్న ఎయిర్‌బేస్‌కు భారీ సంఖ్యలో జనం తరలివస్తున్నారు. 



వారిని అదుపు చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. విమానం జాడ ఇంకా తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఐఎన్ఎస్ సహ్యాద్రి , ఐఎన్ఎస్ రాజ్‌పూట్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ జ్యోతి తదితర నౌకలతో గాలింపు కొనసాగిస్తున్నారు. నాలుగు కోస్టుగార్డు నౌకలు సైతం ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. గల్లంతైన విమానంలో 29 మంది ఉండగా వారిలో 8మంది విశాఖ వాసులు ఉన్నారు.



విమాన గల్లంతు బాధిత కుటుంబాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం ఉదయం విశాఖ చేరుకున్న సీఎం.. బాజీ జంక్షన్‌, బుచ్చిరాజుపాలెంలో నివసిస్తున్న ఎన్‌ఏడీ ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. గల్లంతైన వారిని గాలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆందోళన చెందవద్దని తెలిపారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నతాధికారులు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: