కేసీఆర్ కి చెక్ పెట్టే దమ్ము కోదండ రాం కు ఉందా...?

Shyam Rao
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడు ఎవరు అని ప్రశ్నించుకుంటే టక్కున వచ్చే సమాధానమే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీర్ అనే సమాధానం విస్పష్టం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టి మరీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత ఉద్యమ సంఘాలకు నాయకులుగా వ్యవహరించిన వారందరికీ ఉన్నత పదవులు కట్టబెట్టిన కేసీఆర్ అందరి ప్రశంసలను అందుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. 



కానీ రాష్ట్రాన్ని రాజకీయ పరంగా ఒక్కటి చేసి ప్రజలకు దిశా నిర్దేశం చేసి, వివిధ వర్గాల ప్రజలను ఒక్కటి చేసి, వాటికి జేఏసీ గా మార్చి, అన్ని జేఏసీలను ఒక్క థాటిపై నడిపించిన ప్రొఫెసర్ కోదండ రాం మాత్రం కేసీఆర్ వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కేసీఆర్ పై కోదండరాం విమర్శలను ఎక్కుపెడుతున్నారు...? కోదందారం వెనకాల ఉండి ఆయన్ని ప్రోత్సహించే వారెవరు...? ప్రతిపక్షాలతో కోదండరాం కుమ్మక్కయ్యారా...? లేదా కొత్త పార్టీ నెలకొల్పడానికి కోదండ రాం ప్రయత్నిస్తున్నారా...? ఇలా ఆయన గురించి అంతుచిక్కని ప్రశ్నలెన్నో ప్రజల మనస్సులో మెదులుతున్నాయి. 



తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినంత వరకు వీరిద్దరి మధ్య సఖ్యత ఉన్నా, ఆ తర్వాత వీరిద్దరి మధ్య విముఖత ఏర్పడింది. దీని వెనకాల కారణాలు లేకపోలేదు. కోదండరాం కి విద్యార్ధి జేఏసీ నాయకులన్నా వారి ఆలోచనా విధానలన్నా మక్కువ ఎక్కువ. విద్యార్థులకు కూడా కోదండ రాం అంతే ఎంతో అభిమానం, గౌరవం. మొదటి నుంచి కేసీఆర్ ఆలోచనా శైలి నచ్చని కోదండరాం విద్యార్థులకు పరోక్షంగా మద్ధతు తెలుపుతూనే వస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విద్యార్థులపై లాఠీ జులిపించారు. 



దీన్ని మనసులో పెట్టుకొన్న విద్యార్థులు కోదండ రాం ని వారి తరపున మరో ఉద్యమాన్ని నడిపించే నాయకుడిగా ఎన్నుకొన్నారు. మొదటి నుంచీ విద్యార్థులంటే మక్కువ ఉన్న కోదండ రాం వారి ఆలోచానా శైలికే ఓటేసి ప్రభుత్వం పై విమర్శలను సంధిస్తూనే వస్తున్నారు. అయితే దీనిని ఆసరాగా తీసుకున్న ప్రతిపక్షాలు ఆయన వైఖరిని సమర్థిస్తూ ఆయన్ని తమ పార్టీలో చేర్చుకోవాలని తహ తహ లాడుతున్నారు. ఏ పార్టీలోనూ చేరడానికి సంసిద్దంగా లేని కోదండ రాం విద్యార్థుల పట్ల అండగా నిలవడానికి మాత్రమే సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.



ఇటీవల కాలంలో కోదండ రాం కొత్త పార్టీ పెడుతున్నారని వార్తలు గుప్పు మన్నా ఆయన మాత్రం అందుకు సంసిద్దంగా లేనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలో ఉన్న లోపాలనే ఆయన ప్రశ్నించే పనిగా పెట్టుకోన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఏది ఏమైనా అందరు నాయకులు ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే ప్రజలకు మద్ధతుగా కోదండ రాం నిలిచారని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: