ఇక రాజీనామా చేస్తారా కేసీఆర్..?: రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న...!!

Shyam Rao
మహారాష్ట్రతో ఒప్పందం పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని తెదేపా తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు.  రేవంత్‌రెడ్డి గురువారమిక్కడ తెదేపా కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘గతంలో మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నట్లు నిరూపిస్తే నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా ఇస్తానన్నారు. 1975లో మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మధ్య కుదిరిన ఒప్పందానికి కొనసాగింపుగా 2012లో చేసిన ఒప్పంద పత్రాలను విడుదల చేస్తున్నా. కేసీఆర్‌.. రాజీనామా చేస్తానన్నారుగా.. అది మీ చిత్తశుద్ధికే వదిలేస్తున్నానన్నారు. 



గత ప్రభుత్వాలన్నీ ప్రాజెక్టుల విషయం లో తెలంగాణకు అన్యాయం చేశాయని చెబుతున్న కేసీఆర్, అసలు మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం వివరాలను ఎందుకు చెప్పడంలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో కుదిరిన ఒప్పందం మేరకు సాంకేతిక కమిటీ ప్రతిపాదనల్ని స్టాండింగ్‌ కమిటీకి ఎందుకు పంపలేదు. మహారాష్ట్ర వాడుకునే నీటి శాతం మేరకు ప్రాజెక్టులో ఖర్చు భరించాల్సి ఉంది. ఆ విషయాన్ని ఎందుకు విస్మరించారు. 



తుమ్మిడిహట్టి నుంచి 160 టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని నాటి ఒప్పందంలోనే మహారాష్ట్ర సీఎం చెప్పారు. ఇరు రాష్ట్రాల సాంకేతిక కమిటీ సమావేశంలోనూ 90 రోజుల్లో 160 టీఎంసీల నీటిని తీసుకోవాలంటే ప్రాజెక్టు ఎత్తు 154 మీటర్లు ఉండాలని లేదంటే కనీసం 152 మీటర్లు తగ్గకూడదన్న అవగాహనకు వచ్చింది. విశ్రాంత ఇంజినీర్ల నివేదికలోనూ 151 లేదా 150 మీటర్లకు తగ్గకూడదని స్పష్టం చేశారు. కేసీఆర్‌.. ఈ విషయాన్ని ఎందుకు విస్మరించారు. 



నాటి అధికారులు ఎత్తు తగ్గించకుండా ఉంచేందుకు వాదించిన వాదనలు, అందుకు మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పని విషయం మినిట్స్ లో నమోదయ్యాయని, ఇప్పుడు కేసీఆర్ రాజీపడి తెలంగాణ వాసులకు తీరని ద్రోహం చేశారని నిప్పులు చెరిగారు. ఎత్తు తగ్గించి నీటిని ఎత్తిపోయడం వల్ల రూ. 50 వేల కోట్ల అదనపు ఖర్చుతో పాటు ఏటా విద్యుత్ నిమిత్తం రూ. 10 వేల కోట్లు ఖర్చవుతుందని అన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని, ప్రజలను మోసం చేసిన కేసీఆర్ తప్పును అంగీకరించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: