ఉద్యోగం కోసం విమానం తయారుచేసి షాకిచ్చాడు!

Edari Rama Krishna
హైదరాబాద్ లాంటి నగరంలో ఆఫీసుకు వెళ్లడం ఎంత నరకమో ప్రత్యేకంగా చెప్పేనక్కర్లేదు. ట్రాఫిక్ జాములు, కిక్కిరిసిపోయే బస్సులు, గతుకుల రోడ్లు.. అబ్బో చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. ఆఫీసు కూతవేటు దూరంలో ఉన్నా సమయానికి చేరుకోవాలంటే కనీసం గంట ముందు బయలుదేరాల్సిన పరిస్థితి. అదే కాస్త సిటీ శివారులో ఉంటే మాత్రం ఆ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే రెండుమూడు గంటల ముందే బయలుదేరి నానా అగచాట్లు పడి చివరికి ఎలాగోలా ఆఫీసుకు చేరుకుంటారు. ఇక దేశంతో సంబంధం లేకుండా ట్రాఫిక్ జాములు ఎక్కడైనా సాధారణమే.

అందుకే చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఓ ఉద్యోగి కాస్త వినూత్నంగా ఆలోచించి కార్యాలయానికి వెళ్లేందుకు ఏకంగా సొంతంగా విమానాన్నే తయారుచేసుకున్నాడు. విమానం తయారుచేసుకున్నాడంటే ఆయన ఆఫీసు ఎంత దూరంలో ఉందో అనుకునేరు. అదేం లేదు.. కారులో వెళ్తే 14 నిమిషాల సమయం పడుతుందట. కానీ ఆ సమయాన్ని కూడా తగ్గించాలని ఏకంగా విమానాన్నే తయారుచేసుకున్నాడు.   చెక్ రిపబ్లిక్‌లోని దికోవ్‌కు చెందిన ఫ్రాంటిసెక్ హడ్రవా(45) సైన్ ప్రాంతంలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడుంటున్న ప్రాంతం నుంచి కంపెనీకి చేరుకునేందుకు కారులో 14 నిమిషాల సమయం పడుతుండడంతో సమయం వృథా అవుతుందని భావించిన ఫ్రాంటిసెక్ సమయాన్ని మరింత తగ్గించాలని భావించాడు. అందుకు విమానమే కరెక్టని భావించి రెండేళ్లు కష్టపడి విమానాన్ని తయారుచేశాడు.

మూడు సిలిండర్లతో నడిచే ఇంజిన్ ఉపయోగించి పూర్తిగా చెక్కను ఉపయోగించి విమానాన్ని తయారుచేసేశాడు. ఇందుకోసం రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఈ విమానం గంటకు 146 కిలీమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గంటకు ఆరు లీటర్ల పెట్రోలు ఖర్చవుతుంది.  ప్రస్తుతం ఈ విమానంలోనే ఆయన ఆఫీసుకు చేరుకుంటున్నాడు. ఇక సమయం తగ్గించుకునేందుకు విమానాన్ని తయారుచేసిన ఫ్రాంటిసెక్‌ను చూసి తోటి ఉద్యోగులు, కంపెనీ సైతం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అభినందించింది కూడా. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: