భారత్ కు అండగా ఉంటాం : అమెరికా


అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సీజన్‌ కొనసాగుతున్నప్పటకీ ఆ దేశ నాయకత్వం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి "జాన్‌ కెర్రీ"  గత రెండురోజుల్లోనే రెండుసార్లు భారత విదేశాంగ మంత్రి "సుష్మాస్వరాజ్‌" తో  ఈ అంశంపై ముచ్చటించారు. పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు తలెత్త కుండా చూడాలని భారత్‌కు అమెరికా సూచించింది. యూరీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ దౌత్యపరంగా ఏకాకిని చేయడం తో పాటు పలు రకాలుగా దెబ్బతీసేందుకు భారత్‌ ప్రయత్ని స్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం నుంచి ఈ సూచన రావడం గమనార్హం.


ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు సుష్మా స్వరాజ్‌ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. గత సోమవారం ఆమె పాకిస్థాన్‌ తీరును దుయ్యబడుతూ ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో జాన్‌ కెర్రీ రెండుసార్లు సుష్మాతో మాట్లాడారని విశ్వసనీయ దౌత్య వర్గాలు తెలిపాయి. యూరీ ఉగ్రవాద దాడి అనంతరం అమెరికా నాయకత్వం నేరుగా భారత్‌ను సంప్రదించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా వీరి మధ్య చర్చలు జరిగి నట్టు సమాచారం.


భారతదేశానికి అమెరికా అండగా నిలుస్తోంది. సరిహద్దుల ఆవలి ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి సహకరిస్తామని ప్రకటించింది. పాకిస్థాన్‌ చర్యలను గమనిస్తున్నామని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాదులు, సంస్థలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన పాక్‌ వ్యవహార శైలిని గమనిస్తున్నట్లు తెలిపింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్ భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఫోన్ చేశారు. ఉరి ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతిస్తామని పేర్కొన్నారు. అమెరికా జాతీయ భద్రత మండలి అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఈ వివరాలను పత్రికా ప్రకటనలో తెలిపారు.


 
పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఉరి దాడిని స్పష్టంగా అమెరికా పేర్కొనలేదు. అయితే నిషిద్ధ ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమివ్వడాన్ని పాకిస్థాన్ కొనసాగిస్తుండటాన్ని ఆమోదించేది లేదని తెలిపింది. ఉగ్రవాద నిరోధక, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాదులపై చర్యలకు సంబంధించి సహకారాన్ని పెంపొందించుకుంటామని పేర్కొంది. దీనికి సంబంధించిన కఠిన చర్యలను పాకిస్థాన్ తీసుకుంటుందన్న ఆశాభావాన్ని సుసాన్ వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులపై చట్టపరమైన చర్యలకు కృషిని రెట్టింపు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కట్టుబడి ఉన్నారని తెలిపారు.


సరిహద్దుల ఆవలి ఉగ్రవాదం వల్ల ఈ ప్రాంతానికి ఎదురవుతున్న ప్రమాదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాదులు, లష్కరే తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల నిర్మూలనకు పాకిస్థాన్ చర్యలు తీసు కుంటుందని ఆశిస్తున్నట్లు సుసాన్ చెప్పారని నెడ్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: