సాంకేతికత రోజురోజుకూ మారిపోతోంది. కొత్త సౌకర్యాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే మొబైల్ టెక్నాలజీలో 3జీ, 4జీ సంచలనం సృష్టిస్తున్నాయి. మానవ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేశాయి. ఇప్పుడు రాబోయే 5 జీ టెక్నాలజీతో మరిన్ని పెను మార్పులు రాబోతున్నాయట. 5 జీతో సమాచార సాంకేతిక విప్లవం జెట్ స్పీడుతో పరుగుపెడుతుందట.
ఇంకా చాలా మందికి 4 జీ అందుబాటులోకి రాకమునుపే 5జీ సాంకేతిక పరిజ్ఞానం వేగంతో దూసుకు వస్తోందంటున్నారు నిపుణులు. కన్నుమూసి తెరిచేంతలోపే వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్.. వివిధ పరికరాలతో అనుసంధానం, సమాచార మార్పిడి వంటి అంశాలతో 5జీ సాంకేతికత అందుబాటులోకి వస్తోందంటున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరో ఆధునిక సమాచార విప్లవమన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం.
5జీ సాంకేతికతతో మొబైల్ ఫోన్ తో పాటు ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, ఓవెన్, ఎలక్ట్రానిక్ స్టవ్, ఏసీ, గీజర్ లతో పాటు లైట్లు తదితర పరికరాలు, ఆఫీసులోని కంప్యూటర్, భద్రంగా ఉండాల్సిన పైళ్లు, ఇతర కీలక సమాచారాన్ని దాచిపెట్టే సెక్యూరిటీ లాకర్, వాహనాలు ఇలా అన్ని పరికరాలు, పిల్లల పాఠశాలల సమాచారం, మార్కుల లిస్టులు, డిజిటల్ లాకర్, బ్యాంకు ఖాతాను కూడా మొబైల్ పోన్ ద్వారానే అనుసంధానించునే సౌకర్యం ఉంటుందట.
5జీతో కన్నుమూసి కన్ను తెరిచేంతలోగానే వంద గిగా బైట్ల వేగంతో సమాచార మార్పిడి చేయొచ్చట. హెచ్ డీ టెక్నాలజీతో తీసిన గంటల కొద్దీ నిడివి ఉన్న వీడియోను రెండే క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చట. ప్రపంచంలోని మరో మూలలో ఉండే ఆస్పత్రికు సైతం వర్చువల్ రియాలిటీ, టెలిపోర్టింగ్ అనే ప్రక్రియల ద్వారా నేరుగా డాక్టర్లు వెళ్లి రోగులకు చికిత్సను అందేలా చేయొచ్చట. అత్యంత వేగంగా సమాచార మార్పిడి చేసేందుకు 5జీ టెక్నాలజీ తొడ్పడనుంది. ఐదేళ్లలో 5జీ సాయంతో ఐదు బిలియన్ ఎలక్ట్రానిక్ పరికరాలను అనుసంధానించే అవకాశముంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.