ఆంధ్రాలోనూ జల్లికట్టు సందడి.. ఎక్కడో తెలుసా..?

Chakravarthi Kalyan
జల్లికట్టు.. ఇది తమిళనాడులో ఫేమస్ అన్న సంగతీ తెలుసు.. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని కొన్నిరోజులుగా తమిళనాడులో ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. అయినా సుప్రీంకోర్టు మాత్రం అందుకు అనుమతించలేదు. అనుమతించకపోయినా సంక్రాంతి సందర్భంగా పలుచోట్ల జల్లికట్టు క్రీడ సాగుతూనే ఉంది. ఐతే.. ఈ క్రీడ ఆంధ్రాలోనూ జరుగుతుంది. 


తమిళనాడు పొరుగున ఉన్న చిత్తూరు జిల్లాలో ఏటా జల్లికట్టు సంప్రదాయంగా వస్తుంది. కనుమ రోజు నుంచి జిల్లాలో వివిధ గ్రామాల్లో పశువుల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వినోదం, పశువులు, మనుషులకు ఆటవిడుపు కోసం నిర్వహించే ఈ పండుగ కొన్నిసార్లు హింసాత్మకంగా మారుతోంది. గ్రామ వీధుల్లో పశువులు, యువకుల మధ్య పోరాటమే జరుగుతుంది. 


ఈ జల్లికట్టు కోసం పశువులను అందంగా అలంకరించి కొమ్ములకు విలువైన వస్తువులు, తినుబండారాలు, పలకలు కట్టి మందలుగా పశువులను  వీధుల్లోకి వదులుతారు. పశువుల మంద వెనకాల డప్పులు వాయించడంతో పశువులు బెదిరి పరుగు లంకించుకొంటాయి. కొమ్ములకు కట్టిన వస్తువులను దక్కించుకొనేందుకు యువకులు పశువులు మందపైకి వెళతారు.



ఈ వేడుక చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలిరావడంతో ఆ గ్రామాల్లో జాతర వాతావరణం నెలకొంటుంది. పశువులను లొంగతీసుకొని.. కొమ్ములకు కట్టిన వస్తువులు దక్కించుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు పల్లెజనం. ఐతే ఈ వేడుక సందర్భంగా గ్రామాల మధ్య ఘర్షణలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే కొందరు పశువులకు మద్యం కూడా తాగించడం హింసకు దారి తీస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: