ఈడీ చేతికి జగన్ ఇల్లు.. సాక్షి ప్రధాన కార్యాలయం..!?

Chakravarthi Kalyan
ఏపీ ప్రతిపక్షనేత జగన్ కు ఇప్పుడు మరో చిక్కు ఎదురవబోతోంది. ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్నహైదరాబాద్ లోని లోటస్ పాండ్ భవనం, సాక్షి భవనాలను త్వరలో ఈడీ స్వాధీనం చేసుకోబోతోంది. జగన్ ఆస్తుల స్వాధీన ప్రక్రియను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముమ్మరం చేసింది. సదరు ఆస్తులకు సంబంధించి క్రయవిక్రయ లావాదేవీలు చేపట్టరాదంటూ పత్రికల ద్వారా  బహిరంగ నోటీసులు ఇచ్చింది. 


ఈ నోటీసుల ప్రకారం.. పది రోజుల తర్వాత జప్తు చేసేందుకు ఈడీ సన్నాహాలు చేస్తోంది. భారతీ సిమెంట్స్ వ్యవహారంలో పలు కీలక ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ వేగంగా కదులుతోంది. భారతీ సిమెంట్స్ వ్యవహారంలో మొత్తం 749 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేస్తూ ఈడీ గతేడాది జూన్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ న్యాయ ప్రాధికారిక సంస్థ ధ్రువీకరించగానే ముందుగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 152 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లను స్వాధీనం చేసుకుంది. 


ఈడీ జప్తును సవాల్ చేస్తూ జగన్, భారతి తదితరులు ఢిల్లీలోని అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించారు. అప్పీలేట్ అథారిటీలో తేలేవరకూ స్వాధీన ప్రక్రియ ఆపాలంటూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఫిబ్రవరి 17న అప్పీలేట్ అథారిటీలో విచారణ జరగనుంది. అప్పటి వరకు ఆస్తులు స్వాధీనం చేసుకోవద్దని ఈడీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు గడువు మరో వారం రోజులే ఉన్నందున ఈడీ దూకుడు పెంచేసింది.



హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్, సాక్షి టవర్స్, శేరిలింగంపల్లి మండలం వైఎస్ భారతీ పేరిట ఉన్న 2500 చదరపు గజాల భూమి, వివిధ పేర్ల మీద ఉన్న కడప జిల్లా మామిళ్లపల్లిలో 7.85 ఎకరాలు, కోడూరు మండలంలో 27 ఎకరాలు, గుంటూరులో సరస్వతీ సిమెంట్స్ భూముల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. వీటిని స్వాధీనం చేసుకున్నామని ఎలాంటి అమ్మకాలు, కొనడాలు చేపట్టరాదని పత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: