జగన్ ని అందుకే అడ్డుకున్నారా..!

Edari Rama Krishna
భారత దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి.  డ్రైవర్ల నిర్లక్ష్యం, సరైన కండీషన్ లో లేని వాహనాలు, డ్రైవర్ మద్యం సేవించి వాహనాలు నడపడం..కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాల రోదన అంతా ఇంతా కాదు.  ప్రభుత్వం ఎక్స్ క్రేషియా ప్రకటించినా పోయిన వారిని మాత్రం తీసుకు రాలేదు.  ఇక ఏపీలో కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి చెందారు.  కొత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కామినేని పరామర్శించారు.
 
మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని, చంద్రన్న బీమా వర్తించే వారికి రూ.5లక్షలు, వర్తించని వారికి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్నారు. కాగా  బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను, బాధితులను ఓదార్చేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి.

 బాధలో ఉన్నవారిని పరామర్శించేందుకు నందిగామ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడికి అడ్డంకులు కల్పించడం సబబు కాదని వైసీపీ నాయకులు ఎంత వారించినా వారు వినలేదు.  అంతే కాదు జగన్ రాకముందే మృతదేహాలను తరలించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.   ఆస్పత్రిలోకి వెళ్లకుండా జగన్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

కాసేపటి తర్వాత జగన్ ఆస్పత్రిలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాద వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రిలోకి దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జగన్ మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు.  దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల ప్రవర్తనను వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: