దూషించే సంతానాన్ని నివాసం నుండి వెళ్లగొట్టొచ్చు! ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు



వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల బాధ్యత మరచి నిర్దాక్షిణ్యంగా వారి అశక్తత అధారం చేసుకుని దూషించి హింసించే సంతానా న్ని వారి నివాస గృహం నుండి తరిమివేసే హక్కు తల్లిదండ్రులకు ఉందని దానిని వారు ఎప్పుడైనా వినియోగించు కోవచ్చని నిర్ద్వందంగా తీర్పు చెప్పింది. 


పెద్దవయసు, పదుల సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించి పిల్లల ప్రేమానురాగాల మధ్య శేషజీవితం గడపాలనుకునే దశ. అలాంటివారిని ఆప్యాయతతో ఆదరించాల్సిన సంతానమే ఛీత్కరించుకుంటే? మాటల తో చేతలతో మనసులను గాయ పరిస్తే?  నిస్సహాయ స్థితిలో, జీవిత మలి దశలో ఆ వృద్ద  దంపతులు అనుభవించే క్షోభను ఎంత ని వర్ణించగలం?  అలా బాధ్యత విస్మరించి దురుసుగా వ్యవహరించే సంతానాన్ని తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్ళగొట్టవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచ లన తీర్పునిచ్చింది.




ఇల్లు స్వార్జితం కాకున్నా, సొంతదారుగా యాజమాన్య హక్కులు లేకున్నా చట్టబద్ధంగా తల్లిదండ్రుల ఆధీనంలో ఉండే నివాసం నుంచి తమ పిల్లలను పంపేయవచ్చని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు లేదా సీనియర్ సిటిజన్లు మనశ్శాంతితో గౌరవంగా జీవించగలగాలి. ఈ హక్కు గురించి కోర్టులు పదేపదే గుర్తుచేస్తున్నాయి అని పేర్కొంది. సీనియర్ సిటిజన్ల ప్రాణ, ఆస్తి రక్షణకోసం రాష్ర్టాలు తగిన నిబంధనలు రూపొందించుకోవాలన్న 2007 నాటి చట్టం గురించి కోర్టు ప్రస్తావించింది.





తాగుడు అలవాటు కారణంగా ఉద్యోగం కోల్పోయిన, ఢిల్లీ మాజీ పోలీసు, ఆయన సోదరుడి అప్పీలును విచారించిన జస్టిస్ మన్మోహన్, సీనియర్ సిటిజన్లు మనశ్శాంతితో జీవించాల్సిన పరిస్థితుల గురించి నొక్కిచెప్పారు. తమను ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా 2015 లో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఆదేశించిందని, విచారణ సందర్భంగా ట్రిబ్యునల్ తన పరిధిని మించి వ్యవహరించిందని ఇద్దరు సోదరులు వాదించారు. "మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ యాక్ట్ - 2007"  ప్రకారం, దూషణల అభియోగంపై తమను వెళ్ళగొట్టే ఆదేశం జారీచేసే అవకాశం లేదని పేర్కొన్నారు.


ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆ చట్టంలోని నిబంధనలను అన్వయిస్తూ ట్రిబ్యునల్ అలా ఆదేశించ వచ్చునని 51 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. సీనియర్ సిటిజన్లు సాధారణ జీవితం గడుపగలిగేలా కొన్ని సందర్భాల్లో వయోజనులైన సంతానాన్ని వెళ్ళగొట్టే ఆదేశాలు అవసరమని పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: