తెలుగువారిపై బెంగళూరులో కూడా ప్రాంతీయ విద్వేషసెగలు





ఏమిటో! ఈ ఆధునిక యుగం లో ప్రపంచ పోకడలు అత్యంత ఆధునికంగా ఉండాల్సిందిపోయి, మరింత అనాగరికంగా దయనీయంగా మారిపోవటం మన దురదృష్టం. పెరిగిన సాంకేతిక అభివృద్దితో సమాచార విప్లవం ద్వారా విశ్వమంతా ఒక కుగ్రామంగా మారుతుందని మనమెంత చెప్పుకున్నా, మనుషుల మధ్య మనసుల మధ్య జాతి, మత, ప్రాంత, కుల, లింగ వివక్షలు ఖండాంతరాల దూరాన్ని సమం చేస్తున్నాయి. ఇదంతా ఏ దూరతీరాలకు ప్రమాదకర సంకేతాలకు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి.

 
ట్రంప్ తో వృద్దిచెందుతున్న అమెరికా శ్వేతజాతి దురహంకారం భారతీయులకు ప్రాణసంకటంగా మారుతున్న స్థితిని చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరీ హీనాతి హీనంగా మన ప్రక్క రాష్ట్రం మంకెంతో ప్రీతి పాత్రమైన కర్ణాటకలో కూడా యువత మధ్య ప్రాంతీయ దురహంకారం చెలరేగుతున్న వార్తలు ఇరు రాష్ట్రాల శ్రేయస్సు కోరే వారికి రుచించటం లేదు.  


బెంగళూరులో తెలుగు "బ్యాచ్‌లర్‌ ఐటీ నిపుణులు" అధికంగా ఉండే "మున్నేకొలాల" ప్రాంతంలో విద్వేష దాడి జరిగింది. పేయింగ్‌ గెస్ట్‌ హాస్టళ్లలో ఉంటున్న తెలుగు యువకులను లక్ష్యం గా చేసుకొని శనివారం రాత్రి అక్కడి వారు దాడి చేశారు. ఇక్కడి హాస్టళ్లలో ఇరు రాష్ట్రాలకు చెందిన దాదాపు ఆరు వేల మంది తెలుగు ఐటీ నిపుణులు ఉంటున్నారు. శుక్రవారం రాత్రి కాలనీలో బైకుపై నిర్లక్ష్యంగా వెళుతున్న ఇద్దరు స్థానిక యువకులు రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న తెలుగు ఐటీ నిపుణుడిని ఢీకొట్టారు. దాంతో ఆగ్రహించిన అతను వారితో వాగ్వాదానికి దిగాడు. బయటి నుంచి వచ్చిన వాళ్లకు ఎంత ధైర్యమంటూ అతన్ని కొడుతూ, తెలుగులోనే అతణ్ణి, తెలుగువారిని అత్యంత ఘోరంగా దుర్భాషలాడారు.



 

చుట్టుపక్కల గుమిగూడిన జనం ఆ స్థానికులిద్దర్నీ కొట్టి పంపించారు. ఆ తర్వాత తెలుగు వాళ్లంతా ఏం జరుగుతుందోనన్న భయంతో హాస్టళ్లలోనే ఉండిపోయారు. అనుమానించినట్లుగానే అదే రాత్రి 40 మంది స్థానికులు కర్రలతో వచ్చి తెలుగువారికి హెచ్చరికలు చేస్తూ రాత్రంతా కాలనీలో గస్తీ తిరిగారు. మర్నాడు శనివారం రాత్రి మరింత మంది యువకులు కార్లలో వచ్చి కాలనీలో అన్ని ఇళ్లలో లైట్లు బంద్‌ చేయించారు. తర్వాత ప్రతీ హాస్టల్‌ రూమ్‌ తిరిగి అనుమానం వచ్చిన వాళ్లందర్నీ తీవ్రంగా కొట్టారు. 


ఈ దాడిలో దాదాపు 50 మంది తెలుగువాళ్లు గాయపడ్డట్లు తెలుస్తుంది. దాంతో ఒక్క సారిగా తెలుగువాళ్ళు బెంబేలెత్తిపోయారు. పోలీసులకు సమాచారం అందించడానికి కూడా ఎవరూ ధైర్యం చేయలేదు. పోలీసులు కూడా ఆ పక్కకు రాలేదు. సోమవారం ఉదయం ఆఫీసులకు బయల్దేరే వరకూ మున్నేకొలాల లోని తెలుగు వారెవరూ భయంతో కనీసం తలుపులు తీయలేదు.



 

అన్ని ఐటీ కార్యాలయాల్లోనూ సోమవారం ఇదే చర్చ. సాధారణంగా బెంగళూరులో కన్నడిగులు తెలుగువాళ్లతో స్నేహంగా ఉంటారు. మున్నేకొలాలలో ఏడాదికాలంగా స్థానిక యువతకు, తెలుగు ఐటీ యువతకు మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహే్‌షబాబు, పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణల సినిమాల విడుదల సందర్భంగా కొందరు తెలుగువాళ్లు చేసే హడావుడి అక్కడి వాళ్లకు నచ్చడం లేదని అంటున్నారు.






ఈ అభిమాన సంఘాలవాళ్ళు చేసే యాగీ మన హైదరాబాద్ లో మనకే నచ్చదు. అలాంటిది వేరే చోట వేరే వాళ్ళకు నచ్చక పోవచ్చు. విద్యావంతులు ఐన ఐటి ఉద్యోగులకు ఒకరు మంచి చెప్పవలసిన పనిలేదు. ఆఫ్ట్రాల్ వాళ్ళు నటులు నటిస్థారు డబ్బులు తీసుకుంటారు. ప్రజలు చూడటం వలన వాళ్ళు ధనం పోగేసుకుంటున్నారు. జాతికి వారి వల్ల "వినోద ప్రయోజనం"  మాత్రమే ఉంది. ప్రజలు చూస్తేనే వాళ్ళ సినిమాలకు సొమ్ములు వస్థాయి. వారేమి గొప్పకాదు. ఒక "హోటల్ చెఫ్ ఫూడ్ బాగా చేస్తే మెచ్చు కుంటాం". బట్లర్ సేవలు బాగుంటే కొనియాడుతాం. అంతకుమించి అవసరమనుకుంటే "టిప్స్"  ఇస్తాం. నటులూ అంతే నటన అద్భుతమనిపిస్తే కలిసినప్పుడు లేదా కలుసుకొని అభినందిస్తాం. 





అయితే ఈ దురభిమానమే మన గౌరవాన్ని బజార్లో పడేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ నటులు అభిమానులలో లక్షోవంతుకూడా త్యాగం చేయలేరు. పచ్చి స్వార్ధపరులు. వాళ్ళకోసం కర్ణాటక లోకల్స్ తో గొడవెందుకు?  తెలంగాణా లో ఈ సినిమా పిచ్చి చాలా తక్కువ అలాగే కర్ణాటక వాళ్ళకీ అంతే. ఎటొచ్చి ఆంధ్రా వావాళ్ళే తమిళ ప్రభావంతో వ్యక్తి పూజకు పూనుకుంటారు. కోట్లు సంపాదించుకొనే సినిమావాళ్ళకు వ్యాపారులకు తేడాయే లేదని విద్యావంతులైన ఐటి నిపుణులే కాదు కామన్ మాన్ గుర్తించినా చాలు.     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: