కేశినేని, బోండా సారీ.. కేటీఆర్ పవన్ కాటమరాయుడు సెల్ఫీ.. కోదండ అరెస్ట్.. న్యూస్ రౌండప్ - మార్చి 26

Chakravarthi Kalyan
మనసు నొప్పించివుంటే క్షమించండి : టీడీపీ నేతలు..


విజయవాడ రవాణాశాఖ ఆఫీసులో జరిగిన ఘటనపై విచారిస్తున్నామని, ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే క్షమాపణ చెబుతామని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో గంటసేపు చర్చించామని, ఘటనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.  విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ.. తాము ఎవరినీ దూషించలేదని, తమకు వ్యక్తిగత ఎజెండా అంటూ ఏదీ లేదన్నారు. ఆర్టీఏ కార్యాలయం రగడపై ఆయన మాట్లాడుతూ ఎవరి మనోభావాలైనా దెబ్బతీస్తే క్షమాపణలు చెబుతామన్నారు. 


నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన మంత్రుల కమిటీ

ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 17వ, తేదిన మరోసారి సమావేశం కావాలని రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకొంది. రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ ఆదివారం నాడు హైద్రాబాద్ లో రాజ్ భవన్ లో సమావేశమైంది.విభజన సమస్యలపై ఈ రెండు రాష్ట్రాలకు చెందిన కమిటీ సభ్యులు గవర్నర్ సమక్షంలో చర్చించారు.


కోదండరాం అరెస్ట్‌..


ధర్నాచౌక్‌ తరలించాలనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. 2కే రన్‌లో పాల్గొన్న టీజేఏసీ చైర్మన్‌ కోదండరాంను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ధర్నాచౌక్‌ తరలింపునకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి 2కే రన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాంతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


విజయవాడ ఆకాశవాణికి జాతీయ పురస్కారం..

విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి 2016 సంవత్సరానికిగానూ జాతీయ వార్షిక పోటీల్లో ప్రశంసా పురస్కారం లభించింది. ఆకాశవాణి సీనియర్‌ గ్రేడ్‌ అనౌన్సర్‌ జయప్రకాష్‌ దర్శకత్వంలో రూపొందించిన ఆత్మ దీపోభవ డాక్యుమెంటరీకి ప్రత్యేక అంశం విభాగంలో ఈ ప్రశంసా పురస్కారం లభించింది. ప్రస్తుత సామాజిక మాథ్యమం నేపథ్యంలో పుస్తకం మనుగడపై ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. 


కాటమరాయుడు'కు కేటీఆర్ కితాబు..



తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పవన్‌తో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. ఈ రోజు తాను కాటమరాయుడు సినిమాను చూశానని పేర్కొన్నారు. ఒక సినిమా ద్వారా ఖాదీ వస్త్రాలకు ప్రచారం కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. పవన్ ష్యూర్ విన్నర్ అని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: