కేశినేని నానికి అందుకే అంతగా కాలిందా..!? దాడికి ఇదే కారణం..!?

Chakravarthi Kalyan
కేశినేని నానికి ఎందుకు ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పై ఎందుకు దాడి చేసేంత కోపం వచ్చింది.. అక్రమంగా తిరుగుతున్న బస్సులను అడ్డుకునేందుకేనా.. లేక ఇంకా అసలు కారణాలు ఏమైనా ఉన్నాయా.. అంటే.. ప్రైవేటు ట్రావెల్స్ మధ్య జరుగుతున్న యుద్ధమే ఇందుకు అసలు కారణంగా తెలుస్తోంది. ఈ రంగంలో ఎంపీ ఏకచ్చాధిపత్యం కోరుకుంటున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.


ట్రాన్స్ పోర్టు కార్యాలయంపై దాడికి దిగిన రోజు.. కమిషనర్ జగన్ కు బంధువైన ఆరెంజ్ ట్రావెల్స్ యజమానికి అనుకూలంగా వ్యవహరిస్త్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు సదరు ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని మీడియా ముందుకు వచ్చారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి అధికారి అని, ఆయనవల్లే తాము బస్సులు నడపగలుగుతున్నామని ఆరంజ్ ట్రావెల్స్ సంస్థ అధినేత సునీల్ రెడ్డి చెబుతున్నారు. 


టీడీపీ ఎంపీ అయిన కేశినేని నాని పెద్ద దొంగ అని, రూ. 9 కోట్ల సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టారని సునీల్ రెడ్డి ఆరోపించారు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైనాన్స్ వ్యాపారులను బెదిరిస్తున్నారని, తన మూడు బస్సులపై అక్రమంగా కేసులు నమోదు చేయించారని ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని తెలిపారు. బస్సు ప్రమాదం కేసులో పోలీసుల మీద కూడా నాని ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. 


తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని కేశినేని నాని అధికారులను బెదిరించారని సునీల్ రెడ్డి చెప్పారు. ఆరు నెలల నుంచి కేశినేని నాని తమను ఇబ్బంది పెడుతున్నారని, తామంతా కలిసి ఆయనను ఎంపీగా గెలిపించినా తనపై కక్ష పెట్టుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాని కారణంగా ప్రైవేటు ట్రావెల్స్ అన్నీ దెబ్బతిన్నాయని, చాలామంది బస్సులు నడపడం మానేశారని వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: