దేవినేని నెహ్రూ.. రాజకీయ ప్రస్థానంలో ఎన్ని మలుపులో..!?

Chakravarthi Kalyan
దేవినేని నెహ్రూ అంటే ముందుగా గుర్తొచ్చేది బెజవాడ రాజకీయమే. బెజవాడలోని ముఠాలు, గ్రూపుల గొడవలు కళ్లముందు మెదులుతాయి. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు.. ముందుగా టీడీపీతో వెలుగులోకి వచ్చిన ఈ నాయకుడు.. ఆ తర్వాత అటూ ఇటూ పార్టీలు మారినా చివర శ్వాస విడిచే సమయానికి మళ్లీ టీడీపీలోనే ఉన్నారు. 


టీడీపీ కండువా కప్పుకునే మరణిస్తా.. అంటూ ఉద్వేగపూరితంగా అన్నమాటలను నిజం చేశారు. ఆయన రాజకీయ జీవితాన్ని ఓసారి పరిశీలిస్తే.. నెహ్రూ కంకిపాడు టీడీపీ తరపున 1983 నుంచి 94 వరకూ వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. ఆయన మొదటిసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు వయస్సు కేవలం 26 ఏళ్లు మాత్రమే. తెలుగుదేశంలో చీలిక ఏర్పడినపుడు దేవినేని నెహ్రూ ఎన్టీఆర్ పక్షాన నిలిచారు.


లక్ష్మీ పార్వతి నాయకత్వంలో 1998 పార్లమెంటు ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి పార్టీ వైఫల్యం తర్వాత నెహ్రూ కాంగ్రెస్ లోకి వెళ్లారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఐదోసారి గెలిచారు. నియోజకవర్గ పునర్విభజనతో 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా పోటీచేసి మరోమారు ఓటమి పాలయ్యారు.


ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో దేవినేని సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ కీలక పదవులు నిర్వహించారు. విద్యార్థి రాజకీయాల నుంచి నాయకుడిగా మారిన వ్యక్తి దేవినేని నెహ్రూ.. 1982లో యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ను నెహ్రూ ఏర్పాటు చేశారు. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ఆ సమయంలోనే వంగవీటి-నెహ్రూ వర్గాల మధ్య వివాదాలు చెలరేగాయి. నెహ్రూ సోదరుడిని ప్రత్యర్థులు హత్య చేశారు. 1983 టీడీపీ ఆవిర్భావం సందర్భంగా తెలుగుదేశంపార్టీలో దేవినేని చేరారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: