వారెవా.. ఇక ఆవులకూ ఆధార్ కార్డు ఇస్తారట..!?

Chakravarthi Kalyan
ఆధార్ కార్డు.. ఇప్పుడు దేశంలో ఆధార్ కార్డు ఉండని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అన్ని ప్రభుత్వ పథకాల అమల్లోనూ ఆధార్ కార్డు తప్పని సరి చేశారు. దీని ద్వారా అనేక అక్రమాలను అడ్డుకట్ట వేస్తున్నారు. ఫించన్ కావాలన్నా ఆధార్ కార్డు.. గ్యాస్ కావాలన్నా ఆధార్ కార్డు.. చివరకు మొబైల్ కనెక్షన్ కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి.


అందుకే ఇంతగా విజయవంతమైన ఈ ఐడియాను ఇప్పుడు పశువులకూ వర్తింపజేస్తే ఎలా ఉంటుందా అని ఇప్పుడు కేంద్రం ఆలోచిస్తోంది. ప్రతి పౌరుడికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉన్నట్టే ఇకపై పశువులకూ ఆధార్ కార్డు జారీ చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ముఖ్యంగా ఆవులు, వాటి సంతతికి చెందిన పశువులకు ఆధార్‌ తరహాలో గుర్తింపు సంఖ్యను కేటాయించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసిందట.


ఎందుకు ఇప్పుడు ఆవులకు ఆధార్ అనుకుంటున్నారా.. దేశంలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకే ఈ ఆధార్ అస్త్ర ప్రయోగం అన్నమాట. ప్రత్యేకించి బంగ్లాదేశ్‌ సరిహద్దు గుండా పశువుల అక్రమ రవాణా నిరోధించేందుకు ఆవులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసిందట. ఈ సిఫార్సులను సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించింది. 


పశువులకు ఇవ్వబోయే సంఖ్యను పాలీయురేథేన్‌ ట్యాగులుగా పిలుస్తారు. ఈ ట్యాగ్ లోపశువు వయసు, జాతి, ఎత్తు, రంగు, కొమ్ముల రకం, ఇతర ప్రత్యేక వివరాలు ఉంటాయి. ఇలా అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించి.. నేషనల్ డాటాబేస్ తయారు చేస్తారు. ఐడియా బాగానే ఉంది. మరి అమలులో ఎలాంటి చిక్కులు వస్తాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: