"త్రిపుల్ తలాక్" పై న్యాయస్థానం వేటు వేయనుందా?


భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి. అయినా ఈ భిన్నత్వంలోనూ లింగ వివక్ష లేకుండా వ్యక్తిగత చట్టాలు అమలవ్వాలని ఇక్కడ సమానత్వం భాసిల్లాలని న్యాయస్థానాలు భావిస్తాయి. అసలు భారత సంస్కృతే కొంత సంక్లిష్టం. విభిన్న మతాలు విభిన్న "పర్సనల్ లాస్" కలిగి ఉండటమే కాక, అందులోనూ పురుషులకు ఒక న్యాయం, వనితలకు ఒక న్యాయం పరస్పర విరుద్ధంగా ఉండటం ఇవన్నీ న్యాయ శాస్త్రాలకే కాదు ఆచరణకు అమోదయొగ్యం కాకుండా ఉన్నాయి. అలాంటిదే ఈ "త్రయ తలాక్" అంటే మూడు సార్లు తలాక్ అని పురుషుడంటే వివాహ బంధం గంగపాలే. అదే చట్టం దీన్ని వనితలకు అనుమతించదు.   


ప్రపంచం లో ఏ ముస్లిం దేశాలలోను లేని,  ఖురాన్ నిర్వచించని, మహమ్మద్ ప్రవక్త  సహితం  ప్రవచించని  “త్రయ- తలాక్ “ముస్లిం మహిళల పాలిటి వధ్యశిల. ఇస్లాం మతంలో ఉన్న త్రిపుల్ తలాఖ్ పద్దతి ఆ మతంలో ఉన్న మహిళలకు ఉరిశిక్షలాంటిదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ అభిప్రాయపడ్డారు. ముస్లిం పురుషులు త్రిపుల్ తలాఖ్ అనే పద్దతి ద్వారా వైవాహిక బంధానికి స్వస్తి పలకడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాకపోయినా ఇప్పటికీ దాన్ని అమలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.


త్రిపుల్ తలాఖ్ పద్దతి ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపుతుందని, విడాకులు ఇచ్చేందుకు మహిళలకు పురుషులతో సమాన హక్కులు లేవని ముగ్గురు ముస్లిం మహిళలు సుప్రీంను ఆశ్రయించారు. కాగా ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టుకు అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ ఇది పాపమే కాని చట్టబద్ధమని చెప్పినప్పుడు సీజే పై వ్యాఖ్యలు చేశారు.


ఒకే మతంలో ఉన్న పురుషులు, మహిళలకు పెళ్లి విషయంలో ఒకే తరహా నియమనిబంధనలు ఉండాలని పిటిషనర్ల తరపు న్యాయవాది రాంజెఠ్మలాని అభిప్రాయపడ్డారు. కాగా మతం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పిన విషయాన్ని చట్టం ఆమోదించగలదా?  అని సల్మాన్ ఖుర్షీద్‌ను జస్టిస్ కురియన్ జోసెఫ్ ప్రశ్నించారు.


తలాఖ్‌కు వ్యతిరేకంగా దాఖలైన పలుపిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రత్యేకంగా వేసవిసెలవులు కూడా రద్దుచేసుకుని మరీ పనిచేస్తోంది. ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలో ఒక హిందూ, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం, ఒక జొరాస్ట్రియన్ న్యాయమూర్తులు ఉన్నారు.


అలాగే ముస్లీం మతంలో ఉన్న బహుభార్యత్వం, నిఖా హలాలా వంటి ఆచారాలను కూడా రద్దు చేయాలనే అభిప్రాయాలను కూడా తాము పరిగణలోకి తీసుకున్నట్లు ధర్మాసనం తెలిపింది.


ట్రిపుల్ తలాఖ్ పద్ధతి మహిళల పట్ల వివక్ష చూపిస్తుందని, విడాకులు ఇచ్చేందుకు అందులో మహిళలకు సమానహక్కులు లేవని ముగ్గురు ముస్లిం మహిళల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ చెప్పారు.


“ఫోరమ్ ఫర్ అవేర్‌నెస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ”  అనే సంస్థ తరఫున కూడా జెఠ్మలానీ తన వాదనలు వినిపించారు. ఒకే మతంలో ఉన్న పురుషులు, మహిళలకు పెళ్లి విషయంలో ఒకే తరహా నిబంధనలు ఉండాలని ఆయన అన్నారు. ఈనెల 19వ తేదీ నాటికల్లా ఈ కేసులో వాదనలు ముగించి, జూన్ నెలలో తీర్పు వెల్లడించాలని ధర్మాసనం భావిస్తోంది. భారతదేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత, నిర్వహణ లాంటి అంశాల్లో ఒక్కో మతానికి ఒక్కో పర్సనల్ లా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: