నారాయణ రెడ్డి హత్య.. జగన్ స్పందన ఇలా...?

Chakravarthi Kalyan
వైసీపీ నేత నారాయణ రెడ్డి దారుణ హత్యపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాల్పడుతున్న హత్యా రాజకీయాలపై గవర్నర్‌కు జగన్‌ ఫిర్యాదు చేశారు. వైఎస్‌ జగన్‌తో పాటు పలువురు పార్టీ సీనియర్‌ నేతలు గవర్నర్‌ను కలిశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హత్యారాజకీయాలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. 



టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా అవహేళన చేస్తోందో గవర్నర్ కు వివరించామని జగన్ అన్నారు. ప్రలోభాలకు లొంగకపోతే మనుషులను చంపే ప్రభుత్వ తీరును నరసింహన్ కు వివరించామని అన్నారు. ప్రాణహాని ఉందని.. గన్ లైన్స్ రెన్యువల్ చేయాలని కోరినా పోలీసులు కావాలనే పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నారాయణరెడ్డి గన్ ను సరెండర్ చేసుకుని మళ్లీ వెనక్కి ఇవ్వలేదని జగన్ అన్నారు. 



నారాయణరెడ్డి వెంట ఆయుధం లేకుండా టీడీపీ పన్నిన కుట్ర స్పష్టంగా అర్థమవుతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య కేసుతో ప్రమేయం ఉన్న కేఈ కృష్ణమూర్తి తనయుడిపై కోర్టులే సుమోటోగా జోక్యం చేసుకుని కేసు వేయాలని ఆదేశించాయని జగన్ గుర్తు చేశారు. నారాయణరెడ్డి హత్య విషయంలో సాక్ష్యాధారాలు లేకుండా చేయడం కోసమే పోలీసులు ఆలస్యంగా వచ్చారని జగన్ అన్నారు. 



నారాయణరెడ్డి రాజకీయంగా ఎదుగుతున్నాడని.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడని ఊహించే టీడీపీ నేతలు అతడిని అతి కిరాతకంగా హత్య చేశారని జగన్ మండిపడ్డారు. ఒకవైపు అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని.. మరోవైపు ప్రలోభాలకు లొంగకపోతే దాడులకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. టీడీపీ హత్యారాజకీయాలకు చరమగీతం పాడే రోజు వస్తుందని జగన్ అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: