మహానాడులో మళ్లీ అదే గోల..!

KSK
విశాఖ మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రసంగంలో ఏదైనా ఒక్కకొత్త ముక్క వినిపిస్తుందని, నూతన కదలిక వస్తుందని ఆశించిన వారికి ఆశాభంగమే మిగిలింది. తాను తన శ్రమ, హైదరాబాద్‌ అభివృద్ధి, విడిపోయాక కష్టాలు ఇదే రికార్డు. కొత్తగా ఇప్పుడు తెలంగాణను కూడా అభివృద్ధి జపంలో వేసుకున్నారు. ఎపిలో తగినంత వృద్ధిరేటు కనిపించకపోవడం ఒక కారణమైతే అది కూడా నా కృషి పునాదిపై వచ్చిందేనని చెప్పుకోవడం రెండో కారణం.

టిఆర్‌ఎస్‌ పాలనను కూడా పరోక్షంగా ఆమోదించినట్టు కనిపించడం అసలు కారణం. జాతీయ పార్టీ అద్యక్షుడుగా దిశానిర్దేశం చేయవలసిన చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అన్ని విధాల అండగా వుంటానని సహకరిస్తానని చెప్పడం బయిటివారు మాట్లాడినట్టుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకుంటే హైదరాబాదు మహానాడులో విమర్శించలేదన్న విమర్శనుంచి తప్పించుకోవడం కోసం సండ్ర వెంకట వీరయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ కాస్త మాట్లాడారు.

ఎపి విషయానికి వస్తే రాష్ట్రాభివృద్ధి కోసమే కేంద్రంతో రాజీ పడ్డానని సమర్థించుకున్నారు. ఎవరైనా రాజకీయ ఒత్తిడి తేవాలి గాని రాజీ పడితే రాష్ట్రానికి రావలసినవి ఎలావస్తాయి? బిజెపి విషయంలో పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితికి ఈ మాటలు అద్దం పట్టాయి. సాక్షాత్తూ అమిత్‌ షా సభలోనే టిడిపితో తెగతెంపుల ప్లకార్డులు కనిపించినా ఆయన కూడా వాటిపై స్పందించకపోగా తేలిగ్గా తీసేసినా వీరికి మాత్రం అభ్యంతరం లేదట.

జగన్‌ నాయకత్వంపైన వైసీపీపైన పాత విమర్శలే వినిపించాయి తప్ప మునుపటి గట్టి దనం లేకపోవడానికి బిజెపి హస్తం కారణమా?సంక్షేమ పథకాలు అభివృద్ధిలో దూసుకుపోవడం కూడా ఎప్పటి ఆత్మస్తుతినే తలపించాయి. మొత్తంపైన ఒక్కఆత్మ విమర్శ గాని, ఆ విధంగా ఆలోచించాలని గాని చెప్పింది లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: