పనామా గేట్ కుంబకోణం లో ప్రధాని కుటుంబం




పాకిస్థాన్ ప్రధాని న‌వాజ్ ష‌రీఫ్ మెడ‌కు ప‌నామా ఉచ్చు పూర్తిగా బిగిసింది. ష‌రీఫ్, ఆయ‌న కుటుంబం అక్ర‌మాస్తుల‌పై విచార‌ణ జ‌రిపిన జాయింట్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ (జేఐటీ) సోమ‌వారం పాక్ సుప్రీంకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించిన విష‌యం తెలిసిందే. ఆ నివేదికలో ఏముందో బ‌య‌ట‌కు వెల్ల‌డి కాక‌పోయినా, ప్ర‌ధాని అక్ర‌మాస్తులు నిజ‌మేన‌ని జేఐటీ త‌మ నివేదిక‌లో చెప్పిన‌ట్లు అక్క‌డి మీడియా వెల్ల‌డించింది. దీంతో ప్ర‌ధాని పద‌వి నుంచి ష‌రీఫ్‌ను త‌ప్పించే ప్ర‌క్రియ ప్రారంభ‌మైన‌ట్లేన‌ని పాక్ మీడియా అభిప్రాయ‌ప‌డింది.



ప్ర‌ధాని అక్ర‌మాస్తుల‌పై జేఐటీ నివేదిక‌కు అక్క‌డి మీడియా అసాధార‌ణ ప్ర‌ధాన్యత ఇచ్చింది. ఈ నివేదిక మొత్తం అక్క‌డి మీడియాలో చేతుల్లో ఉంది. దీంతో రోజంతా జేఐటీ నివేదిక‌, రాజ‌కీయంగా రానున్న మార్పులపై చ‌ర్చ‌లు జోరుగా సాగాయి. ఆదాయానికి మించి ష‌రీఫ్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల ఆస్తులు ఉన్న‌ట్లు జేఐటీ తేల్చింది. ప్ర‌ధాని, ఆయ‌న ముగ్గురు సంతానంపై కేసు న‌మోదు చేయాలని కూడా జేఐటీ సిఫార‌సు చేసింది. ష‌రీఫ్ కంపెనీలు అన్నీ న‌ష్టాల్లో ఉన్నాయ‌ని, అవి ష‌రీఫ్ కుటుంబ ఆస్తుల‌ను ఏవిధంగానూ స‌మ‌ర్థించేలా లేవ‌ని జేఐటీ స్ప‌ష్టంచేసిన‌ట్లు అక్క‌డి ప్ర‌ముఖ ప‌త్రిక డాన్ వెల్ల‌డించింది. దీంతో ప్ర‌ధానిని ప‌ద‌వి నుంచి త‌ప్పించే ప్ర‌క్రియ మొద‌లైన‌ట్లేన‌ని ఆ ప‌త్రిక తెలిపింది.



ఇదిలా ఉండగా పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం నవాజ్‌పై కూడా పనామా కుంభకోణం కేసు పై సంయుక్త విచారణ కమిటీ (జేఐటీ) సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తమకు నకిలీ ధృవపత్రాలు సమర్పిస్తున్నారని, ఇది ముమ్మాటికీ క్రిమినల్‌ కేసు అవుతందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పనామా గేట్‌ కుంభకోణంలో షరీఫ్‌ కుటుంబానికి పెద్ద మొత్తంలో చోటుందని, దానికి సంబంధించిన విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ లోని జాయింట్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం ఈ కేసును విచారిస్తోంది.



 JIT members


అయితే, షరీఫ్‌ కూతురు మరియం నవాజ్‌, ఆమె సోదరులు హుస్సేన్‌ నవాజ్, హసన్‌ నవాజ్‌, అలాగే ఆమె భర్త కెప్టెన్‌ మహ్మద్‌ సఫ్దార్‌ కూడా తప్పుడు ధ్రువపత్రాలపై సంతకాలు పెట్టి వాటినే సమర్పిస్తూ సుప్రీం కోర్టును పక్కదారి పట్టిస్తున్నారంటూ జేఐటీ ఆరోపించింది. "మరియం నవాజ్‌కు 2009 నుంచి 2016 మధ్య కాలంలో రూ.73.5మిలియన్‌ల నుంచి రూ.830.73 మిలియన్‌ల వరకు ముట్టాయి" అని కూడా జేఐటీ తమ విచారణానంతరం తెలిపింది. ఎలాంటి ఆదాయం లెక్కలు చూపించకుండానే 1990 నుంచి ఈ మధ్య కాలంలో అనూహ్యంగా ఆమె ఆస్తులు వందల రెట్లు పెరిగాయని కూడా పేర్కొంది. అయితే, దీనిపై మరియం నవాజ్ అసలు విషయం సుప్రీంకోర్టులో తేలుతుందని, అంతకు ముందు వచ్చే ఏ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: