వెంకయ్యనాయుడి ఎంపిక వెనుక వ్యూహమిదేనా..?

Vasishta

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని తెరపైకి తెచ్చింది బీజేపీ అధిష్టానం. ఆయన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ‘మిమ్మల్ని’ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశామంటూ స్వయంగా వెంకయ్యనాయుడికి అధినేత అమిత్ షా చెప్పేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి ఇప్పటికిప్పుడు వైదొలిగే ఉద్దేశం లేదని వెంకయ్య చెప్పినా.. ఇక దీనిపై పెద్దగా చర్చ ఉండకపోవచ్చు. మోదీ – షా ద్వయం చర్చించుకోకుండా వెంకయ్యను తెరపైకి ఎందుకు తీసుకొస్తారు..?


బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరొందారు వెంకయ్యనాయుడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు విపక్షాలతో సంప్రదింపులకోసం వెళ్లాల్సి వస్తే మొదటి వినిపించేది వెంకయ్య పేరే.! నాడు వాజ్ పేయి, అద్వానీలకు ప్రమోద్ మహాజన్ ఎలా ట్రబుల్ షూటర్ గా పనిచేశారో.. ఇప్పుడు మోదీ – షా ద్వయానికి వెంకయ్య అలా ఉపయోగపడుతున్నారు. అలాంటి వ్యక్తిని క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించి ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం నిజంగా సాహసమే.!


మోదీ ఏం చేసినా దాని వెనుక ఓ వ్యూహముంటుంది. ఇప్పుడు అనూహ్యంగా వెంకయ్యను తెరపైకి తీసుకురావడం వెనుక కూడా ఏదో ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ స్ట్రాటజీని పరిశీలిస్తే.. వెంకయ్య దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి. దక్షిణాన బలపడాలనేది బీజేపీ వ్యూహం. ఇప్పటికే ఉత్తరభారతీయులు అన్నింటా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాదిపై దక్షిణాదిన ఆగ్రహావేశాలు మొదలవుతున్నాయి. ఈ నిప్పును ఆదిలోనే చల్లార్చాలంటే దక్షిణాదికి చెందిన వ్యక్తిని కీలక పదవిలో కూర్చోబెట్టాలి. అప్పుడు తమకూ ప్రాతినిద్యం దక్కిందనే భావన దక్షిణాదివారిలో కలుగుతుంది.


ఇక రెండో అంశాన్ని పరిశీలిస్తే రాజ్యసభ సారధిగా ఉపరాష్ట్రపతి పదవి చాలా కీలకం. రాజ్యసభలో ఇప్పటికీ తమ ఆధిపత్యం లేదనేది బీజేపీ భావన. ఆ స్థానంలో వెంకయ్యలాంటి సమర్థుడిని కూర్చోబెడితే తమ పని ఈజీ అవుతుందనేది ఆ పార్టీ వ్యూహం. కీలకబిల్లుల సమయంలో వెంకయ్య చాకచక్యంగా వ్యవహరించగలరనడంలో ఎలాంటి సందేహం లేదు.


వెంకయ్య ఎంపిక వెనుక మరో వ్యూహం కూడా ఉండొచ్చు. 2019 ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమా ఇప్పుడు బీజేపీకి ఉంది. 2024 నాటికి మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత రావచ్చు. అప్పటికి ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో బీజేపీ పరిస్థితి కాస్త మెరుగు పడొచ్చు. ఆ సమయంలో వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యను తెరపైకి తెస్తే దక్షిణాదిన మరింత ఊపు లభించడం ఖాయం. అలా 2024 ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చేందుకు అవసరమయ్యే ముందుచూపుతోనే వెంకయ్యను ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చారని కొంతమంది భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: