మహేశ్ ఫ్యామిలీలో చిచ్చు పెడుతున్న టీడీపీ - వైసీపీ..!

Vasishta

సినిమా స్టార్స్ పాలిటిక్స్ లో జోక్యం చేసుకోవడం.. లేకుంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేయడం ఇటీవల చాలా కామనైపోయింది. రాజకీయ పార్టీలు కూడా సినిమా స్టార్స్ కోసం వెంపర్లాడుతున్నాయి. సాదాసీదా వ్యక్తిని బరిలో నిలపడం కంటే బాగా ఫెమిలియర్ అయిన ఏ సినీతారనో దించితే తమ పని ఈజీ అయిపోతుందనేది ఆ పార్టీల యోచన. ఇప్పుడు పొలిటికల్ పార్టీల కన్ను ప్రిన్స్ మహేశ్ పై పడ్డాయి.


          మహేశ్ టాలీవుడ్ సూపర్ స్టార్. తండ్రి సూపర్ స్టార్ కావడంతో ఆ చరిష్మా ఈజీగానే క్యారీ అయింది. దానికి తోడు మహేశ్ కు పడిన సినిమాలు కూడా అద్భుతమైన క్రేజ్ తీసుకొచ్చాయి. ప్రేక్షకాదరణలోకానీ, బాక్సాఫీస్ వసూళ్లలోకానీ ఇప్పుడు మహేశ్ టాప్ లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు మహేశ్ ను తమ పార్టీ తరపున ప్రచారం చేయించుకునేందుకు వైసీపీ, టీడీపీలు పోటీ పడుతున్నాయి.


          సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. మహేశ్ బాబాయ్ ఆదిశేషగిరి రావు కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం కొనసాగారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇప్పుడు కూడా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏదైనా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం కూడా కనిపిస్తోంది.


          ఇక మహేశ్ సోదరిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసుకున్నారు. గల్లా జయదేవ్ కుటుంబం టీడీపీలో కొనసాగుతోంది. గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్నారు. మామగారి కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెం గుంటూరు పరిధిలోనే ఉంది. అందుకే బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అలా పరోక్షంగా తెలుగుదేశం పార్టీతో వియ్యమొందారు హీరో మహేశ్. అంతేకాదు.. ఇప్పుడు అమరావతి పరిధిలో ఒక విద్యాసంస్థను ఏర్పాటు చేయాలనే కోరికతో ఉన్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. అవసరమైతే ఉచితంగా భూమిని ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. కానీ మహేశ్ మాత్రం ఉచితంగా వద్దని, నామమాత్రపు ధరకు కేటాయించాలని కోరినట్లు సమాచారం.


          అయితే.. మహేశ్ మాత్రం ఇటు బావ – బాబాయ్ మధ్యలో నలిగిపోతున్నారు. గల్లా జయదేవ్ ను ఓడించాలంటే ఈసారి గుంటూరు నుంచి ఆదిశేషగిరి రావును బరిలోకి దించాలని వైసీపీ ఆలోచిస్తోంది. కానీ ఇందుకు కృష్ణ కుటుంబం సిద్ధంగా లేదు. రెండు పార్టీల మధ్యలో కుటుంబం నలిగిపోవడం, కుటుంబంలో చిచ్చు రేగడం మహేశ్ కు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇప్పుడున్నట్లే ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి .. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: