కసబ్ జైలే మాల్యాకు సేఫ్..! మోదీ సర్కార్ రిపోర్ట్..!!

Vasishta

                 మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను తిరిగి భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత్ లో తనకు ప్రాణహాని ఉందంటూ మాల్యా లండన్ కోర్టుకు వివరించడంతో.. ఆయన భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలంటూ భారత ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. దీనిపై మోదీ సర్కార్ ఓ నివేదిక సమర్పించింది.


          విజయ్ మాల్యా భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండబోదని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న 12 నెంబర్ బ్యారక్ అత్యంత సురక్షితమైనదని తెలిపింది. ముంబై బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి అజ్మల్ కసబ్ ను కూడా ఇదే బ్యారక్ లో ఉంచినట్టు ఆ నివేదికలో పేర్కొంది. ఇప్పుడు మాల్యాను కూడా ఇదే బ్యారక్ లో ఉంచుతామని.. ఇది అత్యంత పటిష్టమైన భద్రత కలిగి ఉందని ఇండియన్ గవర్నమెంట్ వివరించింది.


          బ్యాంకులను కోట్లాది రూపాయలు మోసం చేసారనే ఆరోపణలపై విజయ్ మాల్యాపై భారత్ లో కేసులు నమోదయ్యాయి. విచారణ ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే మాల్యా లండన్ చెక్కేశారు. ఆయన్ను భారత్ కు అప్పగించాలంటూ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే భారత్ లో తనకు రక్షణ లేదంటూ మాల్యా అక్కడ కేసు పెట్టారు. భారత్ కు అప్పగిస్తే మాల్యాకు ఎలాంటి భద్రత కల్పిస్తారో చెప్పాలంటూ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.


          కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తన యాక్షన్ ప్లాన్ ను రూపొందించింది. మాల్యాకు ఎలాంటి భద్రత కల్పిస్తామో వివరిస్తూ ఓ నివేదిక రూపొందించింది. ఇదే నివేదికను భారత ప్రభుత్వం ద్వారా కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికపై తదుపరి విచారణ తర్వాత కోర్టు సంతృప్తి చెందితే మాల్యాను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: