ఎడిటోరియల్ : జేజమ్మా... మాయమ్మా..!!

Vasishta

చేతిరేఖలు చెరిగిపోతున్న వేళ కాంగ్రెస్ పార్టీ కాయకల్ప చికిత్సకు సిద్ధమైంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు హైకమాండ్ వ్యూహలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా అధికారం దూరమైపోతున్న వేళ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రియాంకా ఆవో .. పార్టీకో బచావో అంటూ సరికొత్త నినాదం జపించేందుకు సిద్ధమవుతోంది.


125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. కొన్ని రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకుపోగా.. చాలా రాష్ట్రాల్లో అవసానదశకు చేరుకుంది. ప్రధాని మోడీ ముందు మహా కూటమి కూడా విచ్ఛిన్నమైంది. కాంగ్రెస్ పార్టీకి చిరకాల మిత్రులుగా ఉన్న ఎన్సీపీ, జేడీయూలు కూడా యూపీఏకు రాంరాం అనేశాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించి.. యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ కు అత్యంత సన్నిహతంగా భావించే ఎన్సీపీ గైర్హాజరైంది.


కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాయకత్వలోపం ప్రధాన సమస్య. ఉపాధ్యక్షుడు రాహుల్ మినహా చెప్పుకోదగ్గ నేతలెవరూ కనిపించడం లేదు. ఆనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని ముందుండి నడిపించాల్సిందిగా నేతలు ప్రియాంక గాంధీని కోరుతున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో ఉండే ప్రియాంక రాక పార్టీకి పూర్వ వైభవం తెస్తుందనేది వారి నమ్మకం.


ఇవే పరిస్థితులు కొనసాగితే పార్టీ మనుగడ కష్టమని ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షేభంలో ఉందని సీనియర్ నేత జైరాం రమేష్ వ్యాఖానించారు. ఎమర్జెన్సీ, 1996 ఎన్నికల నాటి పరిస్థుతులకంటే ఇప్పుడు మరింత ప్రమాదంలో ఉందన్నారు. మోదీ- షా వ్యూహాలను ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్నారు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జైరాం వ్యాఖ్యలు మరింత ఇబ్బంది కలిగిస్తాయని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.


వచ్చే ఎన్నికలనాటికి పూర్వవైభవం సాధించాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు రూపొందించాలని భావిస్తోంది. ఇదే ప్రియాంకా గాంధీ రాజకీయ రంగ ప్రవేశానికి మంచి ముహూర్తమని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రియాంకకు సూచనప్రాయంగా తెలియజేశారని సమాచారం. అయితే.. ప్రియాంక నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.


కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు దూరమవుతున్నాయి. ప్రాంతీయపార్టీలన్నీ బీజేపీకి మద్దతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు వెళ్లేందుకు ఎవరైనా ఉత్సాహం చూపిస్తారు. సైద్ధాంతిక విభేదాలుంటే తప్ప బీజేపీతో వెళ్లకపోవడానికి మరో కారణం కనిపించదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో వస్తుంది.. అవి ఏమేరకు సక్సెస్ అవుతాయి.. ప్రియాంక వస్తుందా.. వస్తే ఏమేరకు సక్సెస్ అవుతుంది.. లాంటి అనేక అంశాలు ఇప్పుడు ప్రశ్నార్థకం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: