ఎడిటోరియల్ : టీడీపీ – వైసీపీ సూపర్ మైండ్ గేమ్..సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న నంద్యాల సినిమా..!

Vasishta

నంద్యాల బైపోల్ ఎన్నిక కూడా ఇంకా పూర్తి కాలేదు. రిజల్ట్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ సినిమా మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది. ప్రచారం స్థాయిలోనే సినిమాకు ఈ స్థాయిలో క్రేజ్ రావడంతో రిలీజ్ కోసం నంద్యాల ప్రజలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాదిమంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

          నంద్యాల ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందు నుంచే కాక మొదలైంది. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ టికెట్ కోసం భూమా, శిల్పా కుటుంబాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడిచింది. చివరకు భూమా కుటుంబీకులే గెలిచారు. టికెట్ సాధించారు. ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని శిల్పా మోహన్ రెడ్డి .. టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయారు.


          భూమా నాగిరెడ్డి కుటుంబానికి టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించిన చంద్రబాబు శిల్పా కుటుంబానికి ఎమ్మెల్సీ ఇచ్చారు. శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. అన్న శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వెళ్లిపోయినా తాను మాత్రం టీడీపీలోనే ఉంటానన్నారు చక్రపాణిరెడ్డి. కానీ నోటిఫికేషన్ వచ్చిన కొన్ని రోజులకే చక్రపాణిరెడ్డి కూడా అన్న గూటికి చేరిపోయారు. దీంతో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.


          ఇదంతా వర్తమానం. ఓసారి గతంలోకి తొంగి చూద్దాం. ఆళ్లగడ్డలో ఆది నుంచి భూమా, గంగుల కుటుంబాలదే ఆధిపత్యపోరు. భూమా నాగిరెడ్డి కుటుంబం టీడీపీలో ఉన్నన్నాళ్లు గంగుల కుటుంబం కాంగ్రెస్ లో ఉండేది. భూమా కుటుంబం వైసీపీలోకి వెళ్లగానే గంగుల కుటుంబం టీడీపీలో చేరిపోయింది. టీడీపీలో ఇక తిరుగుండదని భావించారంతా.! అయితే అనూహ్యంగా భూమా కుటుంబం హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించి వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయింది.


          దీంతో గంగుల కుటుంబం మళ్లీ దారి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేసేదేమీ లేక వైసీపీలోకి వెళ్లిపోయింది. భూమా కుటుంబాన్ని ఎదిరించే మగాళ్లు గంగుల కుటుంబం మాత్రమేనని నమ్మిన జగన్.. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డికి ఇచ్చి గౌరవించింది. ఎంతో మంది పోటీలో ఉన్నా కూడా వారందరినీ కాదని తమకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడంతో గంగుల కుటుంబం ఎంతో సంతోషించింది.

          వచ్చే ఎన్నికల్లో గంగుల ప్రతాపరెడ్డి కుటుంబమే వైసీపీని లీడ్ చేస్తుందని అందరూ భావించారు. ఆ కుటుంబం కూడా అలాగే ఆశించింది. అయితే శిల్పా కుటుంబం అనూహ్యంగా వైసీపీలోకి రావడంతో గంగుల కుటుంబం మళ్ళ్లీ దారి వెతుక్కోవాల్సి వచ్చింది. శిల్పా కుటుంబం రాకను మొదట్లోనే గంగుల కుటుంబం వ్యతిరేకించింది. అయితే జగన్ వారికి సర్దిచెప్పారు. కానీ ఆ అసంతృప్తి లోలోపల అలాగే ఉండిపోయింది.


          ఇప్పుడు అవకాశం వచ్చింది. గంగుల కుటుంబం మళ్లీ సేఫ్ జోన్ చూసుకోవాల్సి వచ్చింది. భూమా నాగిరెడ్డి లేకపోవడం, వారి పిల్లలు మాత్రమే రాజకీయాల్లో ఉండడంతో తమకు పోటీ లేదనుకున్నారో ఏమో.. గంగుల ప్రతాపరెడ్డి టీడీపీ గూటికి చేరిపోయారు. ఇది వైసీపీకి గట్టి దెబ్బ. ఇటీవల ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్న గంగుల ప్రభాకర్ రెడ్డి గంగుల ప్రతాపరెడ్డి సోదరుడే. ప్రతాపరెడ్డి రాకతో ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరడం లాంఛనమేనని భావించవచ్చు.


          ఇలా నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ – వైసీపీల ఎత్తుల పైఎత్తులతో రసవత్తరంగా మారింది. ఎన్నిక కూడా కాకముందే సస్పెన్స్ సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేసుకున్న ఈ బైపోల్.. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: