తప్పు మీద తప్పు చేస్తున్న చంద్రబాబు..!?

Vasishta

రాజకీయాలన్నాక నేతలను చేర్చుకోవడం, పంపించడం చాలా సహజం. పార్టీ అవసరం నేతలకున్నా.., నేతల అవసరం పార్టీలకు ఉన్నా మార్పులు, చేర్పులు చాలా సహజంగా జరిగిపోతుంటాయి. అయితే ఒక్కోసారి ఇలా నేతలను చేర్చుకోవడం చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంటుంది. తాజాగా గంగుల ప్రతాపరెడ్డిని టీడీపీలో చేర్చుకోవడం ఇలాంటిదే.!


          గంగుల ప్రతాపరెడ్డి ఆళ్లగడ్డలో మంచి పట్టున్న నేత. భూమా, గంగుల కుటుంబాలకు ఆది నుంచి ఆధిపత్య పోరు ఉంది. 2014 ఎన్నికలవరకూ వీళ్ల కుటుంబాలే తలపడ్డాయి. ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు. ఒకరు ఒక పార్టీలో ఉంటే ఇంకొకరు ఇంకో పార్టీలో చేరిపోవడం ఖాయం. కానీ ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు ఒకే గూటికి చేరాయి. గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరడం ఆళ్లగడ్డ రాజకీయాల్లో మరిన్ని మార్పులకు నాంది పలకడం ఖాయంగా కనిపిస్తోంది.


          గంగుల ప్రతాపరెడ్డికి చంద్రబాబు ఎక్కడ అవకాశం కల్పిస్తారు.. ఆయనకు ఎలాంటి స్థానం కల్పిస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. గంగుల చేరిక విషయం తెలియగానే భూమా అఖిలప్రియ తీవ్రంగా స్పందించారు. ఆయన చేరికవల్ల ఉపయోగం ఏంటో.. అని ఎద్దేవా చేశారు. వారం రోజుల్లో ఎన్నిక పెట్టుకుని ఇప్పుడు చేరడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. అంతేకాదు.. భూమా వర్గానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో చంద్రబాబుకు తెలిసే నిర్ణయం తీసుకుని ఉంటారని అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. అంతేకానీ గంగుల రాకను అఖిలప్రియ సుహృద్భావంతో స్వాగతించలేదు.


          గంగుల ప్రతాపరెడ్డి కూడా మొక్కుబడిగా మాట్లాడారు. గతంలో భూమాతో విభేదాలున్నా.., ఇప్పుడు అలాంటివేమీ లేవన్నారు. అఖిలప్రియకు తనపై అనుమానాలు, అభియోగాలు అక్కర్లేదన్నారు. వీరి మాటలను బట్టే అర్థం చేసుకోవచ్చు వీళ్ల పార్టీ కాపురం ఎలా ఉంటుందో.! భూమా అఖిలప్రియకు ప్రయారిటీ ఇస్తున్నందువల్లే శిల్పా కుటుంబం దూరమైంది. ఇప్పుడు మళ్లీ గంగులను తీసుకురావడం ఏం స్ట్రాటజీయో చంద్రబాబుకే తెలియాలి.


          అఖిలప్రియ ఆల్రెడీ ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే. నంద్యాల ఉపఎన్నికలో కూడా గెలుస్తామని టీడీపీ ధీమాగా ఉంది. అదే జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డికే టికెట్ దక్కుతుంది. మరి గంగుల ప్రతాపరెడ్డిని ఏం చేస్తారు? ఎంపీ టికెట్ ఇస్తారా..? అందుకు ఆయన అంగీకరిస్తారా..? వేచి చూడాలి మరి..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: