నంద్యాల విన్న‌ర్ ఎవ‌రో చెప్పిసిన కేంద్ర నిఘా విభాగం

VUYYURU SUBHASH
నంద్యాల ఉప ఎన్నిక పోరు ఉధ్రుతంగా సాగుతోంది. అధికార, విప‌క్షాలు నువ్వా .. నేనా .. అనే రేంజ్‌లో రోడ్డున ప‌డి ప్ర‌చారం చేస్తున్నాయి. ఇరు పార్టీల అధినేత‌లూ త‌మ త‌మ వ్యూహాల‌కు ప‌దును పెట్టి మ‌రీ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఒక‌రిని మించిన హామీల‌తో మ‌రొక‌రు నంద్యాల ఓట‌ర్ల‌ను బుట్ట‌లో వేసుకునేందుకు అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్రాన్నే కాకుండా దేశాన్ని సైతం కుదిపేస్తోంది. ఇక్క‌డ అధికార‌, విప‌క్షాల నేత‌లు మాట్లాడే ప్ర‌తి మాటా జాతీయ స్థాయిలో సైతం వార్త‌లు వ‌స్తున్నాయంటేనే ఇక్క‌డి ఎన్నిక‌పై ఎంత మంది ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారో తెలుస్తోంది.


రెండు రోజుల కింద‌ట జాతీయ ప‌త్రిక‌లు అన్నింటిలోనూ అధికార టీడీపీ అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద రెడ్డి, విప‌క్ష అభ్య‌ర్ధి శిల్పా మోహ‌న్‌రెడ్డిల‌పై ప్ర‌త్యేక క‌థ‌నాలు క‌నిపించాయి. ఇక్క‌డి గెలుపును పార్టీలు 2019 ఎన్నిక‌ల‌కు మైలు రాయిగా భావిస్తున్నాయ‌ని, చావో రేవో తేల్చుకునే దిశ‌గా విప‌క్షం వైసీపీ ఉంద‌ని వెల్ల‌డించాయి. అదేస‌మ‌యంలో అధికార టీడీపీ త‌న శ‌క్తి యుక్తులు  వినియోగిస్తోంద‌ని, అభివృద్ధి పేరుతో నంద్యాల రూపు రేఖ‌లు మార్చి ఓట‌ర్ల‌ను త‌గ బుట్ట‌లో వేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అదేస‌మయంలో కేంద్ర నిఘా సంస్థ కూడా నంద్యాల‌పై దృష్టి పెట్టింది. 


నంద్యాల ఉప పోరు ప్ర‌చారం.. గ‌తంలో దేశంలో ఎక్క‌డా జ‌ర‌గ‌ని విధంగా జ‌రుగుతోంద‌ని నిఘా సంస్థ‌ల నివేదిక వెల్ల‌డించింది. అంతేకాదు, ఇక్క‌డ విప‌క్ష పార్టీ వైసీపీకి గెలుపు అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని పేర్కొంది. అంతేకాదు, గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించింది. ఈ కేంద్ర నిఘా వ‌ర్గాల లెక్క‌ల ప్ర‌కారం వైసీపీ క‌నీసం 6 వేల మెజార్టీ ఓట్ల‌ను సాధించి గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని పేర్కొంది. 


మ‌రోప‌క్క‌, టీడీపీ నేత‌లు సైతం త‌మ స‌ర్వే తాము చేయించుకున్నారు. ఈ లెక్క‌ల ప్ర‌కారం టీడీపీ అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద‌రెడ్డి.. వైసీపీ అభ్య‌ర్థి.. శిల్పా మోహ‌న్‌రెడ్డిపై క‌నీసం 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడ‌ని వీరు అంచ‌నా వేశారు.  మొత్తానికి ఈ లెక్క‌లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ పుట్టిస్తున్నాయి.  మ‌రి ఎవరు గెలుపు గుర్రం ఎక్కుతారో? ఎవ‌రికి ఎంత మెజారిటీ ల‌భిస్తుందో తెలియాలంటే ఓ ప‌ది రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: