గోడ దూకేందుకు సిద్ధమైన ముద్రగడ..?

Vasishta

          కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికే పరిమితమైపోయారు. అమరావతి వరకూ పాదయాత్ర చేపట్టి కాపులకోసం టీడీపీ ఇచ్చిన హామీలపై నిలదీయాలని భావించిన ముద్రగడకు ఆరోజు నుంచి ఇవాల్టి వరకూ ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. అయితే ఓపిక నశించిన ముద్రగడ తర్వాతి స్టెప్ కోసం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.


          ముద్రగడ పద్మనాభం కాపుజాతి ఉద్ధరణకోసం పోరాడుతున్న నేత. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ గత ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చింది. దీన్ని నిరవేర్చాలని పట్టుబట్టారు ముద్రగడ. ఇందుకోసం గతంలో తునిలో ఓ సభ పెట్టి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


          తుని సభ తర్వాత ప్రభుత్వం కాపుల రిజర్వేషన్లపై ఓ అడుగు ముందుకేసింది. బీసీల్లో రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం మంజునాథ కమిషన్ ఏర్పాటుచేసింది. బీసీల వర్గీకరణ, రిజర్వేషన్లకు సంబంధించి కమిషన్ ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేపట్టింది. అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరిస్తోంది. అయితే ప్రభుత్వం తాత్సారం చేస్తోందంటూ ముద్రగడ మరోసారి ఉద్యమానికి తయారయ్యారు.


          చలో అమరావతి పేరిట పాదయాత్ర చేసేందుకు ముద్రగడ పద్మనాభం సిద్ధమైన వెంటనే ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. ముద్రగడను గృహనిర్బంధం చేసింది. ఆగస్టు 3వ తేదీ నుంచి ఇదే తంతు..! ఆయన ఇంట్లోంచి బయటకు రావడం, బయట పోలీసులు అడ్డుకోవడం.. ఏదో రూపంలో కాసేపు నిరసన తెలపడం.. మళ్లీ ఇంట్లోకి వెళ్లిపోవడం.. ఇదీ పరిస్థితి.!


          అయితే ఇంతకాలం ఓపిక పట్టిన ముద్రగడ.. ఇక ఓపిక లేదని తేల్చేశారు. ఏదో ఒకరోజు ఇంటిగోడ దూకి పాదయాత్ర స్ట్రార్ట్ చేస్తానని హెచ్చరించారు. పాదయాత్రకు అనుమతిస్తారా.. లేకుంటే గోడదూకి వెళ్లమంటారా.. అని అల్టిమేటం జారీ చేశారు. దీంతో.. పోలీసులు మరోసారి అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ముద్రగడ ఝలక్ లు ఇవ్వడంలో దిట్ట. పోలీసులను తప్పుదారి పట్టించి మరో మార్గాన్ని అనుసరించడం ఆయనకు కొత్తేమీ కాదు. కాబట్టి ముద్రగడ స్ట్రాటజీ ఎంలా ఉంటుందో అర్థంకాక పోలీసులు ముదు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నిజంగానే ఆయన గోడ దూకుతారా..? లేదా ఇంకేదైనా ప్లాన్ వేస్తారా..? అనేది వేచి చూడాల్సిందే.!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: