సెన్సేషన్ : బీజేపీ – వైసీపీ దోస్తీ ఖాయం..! మధ్యవర్తిత్వం వహిస్తున్న ‘గాలి’..!!

Vasishta

ఎస్.. బీజేపీతో దోస్తీకి వైసీపీ తహతహలాడుతోంది. అటు బీజేపీకి కూడా పెద్దగా అభ్యంతరాలు లేనట్లు కనిపిస్తున్నాయి. చర్చలు ఫలవంతమైతే తదుపరి మోదీ కేబినెట్ లో వైసీపీ టీం చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి జాతీయస్థాయిలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియాలో కూడా ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


          బీజేపీతో దోస్తీకోసం వైసీపీ చాలాకాలంగా సీరియస్ గా ప్రయత్నిస్తోంది. ఇది బహిరంగ రహస్యమే. రామ్ నాధ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించకముందే వైసీపీ నేతలు ఆయన్ను వెళ్లి అభినందించడం.. ఆ తర్వాత బీజేపీ అడగకముందే మద్దతు ప్రకటించడం జరిగిపోయాయి. దీన్ని బట్టి ఆ పార్టీ ఉత్సాహం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వెంకయ్యనాయుడు ఆ పార్టీ బేషరతుగా మద్దతిచ్చింది.


                కొంతకాలంగా వైసీపీ వ్యవహారాలను చూస్తున్నవారెవరైనా ఆ పార్టీ బీజేపీతో పొత్తుకోసం ప్రయత్నిస్తోందని ఈజీగా చెప్పేస్తారు. కానీ ఇది వాస్తవమని ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. వైసీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత, కర్నాటక బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం. ఆయన సూచనల మేరకే జగన్ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.


          అయితే బీజేపీ మాత్రం కాస్త తటపటాయిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందే ఈ రెండు పార్టీలూ కలసి పోటీ చేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో ప్రతిపక్షపార్టీని చేర్చుకోవడం విమర్శలకు దారితీస్తుందనే కోణంలో ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అధికార టీడీపీ కూడా వైసీపీతో దోస్తీ చేస్తే తాము కలిసి ఉండలేమని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ తన నిర్ణయాన్ని బహిర్గతం చేయకుండా వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది.


          ఒకవేళ టీడీపీతో తమకు పొత్తు అక్కర్లేదని బీజేపీ భావించినట్లయితే వైసీపీతో వెళ్లేందుకు ఏమాత్రం సంశయించకపోవచ్చు. అప్పుడు కేంద్రం నుంచి టీడీపీ బయటకు రావడం, రాష్ట్రంలో టీడీపీ నుంచి బీజేపీ బయటకు రావడం ఖాయం. అదే జరిగితే మరిన్ని కొత్త రాజకీయ సమీకరణాలకు అవకాశం కల్పించినట్లవుతుంది. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: