నంద్యాలలో పోల్ సీన్ ఇదీ..!

Vasishta

నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటర్ల తీర్పుకు వేళయ్యింది. ప్రచారపర్వం ముగియడంతో పోలింగ్ ప్రక్రియకు అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతస్థాయి తనిఖీలు చేసిన అధికారులు నాయకుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాయి. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు..

 

ఉపఎన్నికల హోరుతో దాదాపు నెల రోజులుగా మార్మోగిన నంద్యాల ప్రచారహోరు ముగియడంతో ఓటరు తీర్పుకోసం సిద్ధమైంది. నంద్యాల ఉపఎన్నికల్లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. మంత్రులు, పార్టీ నేతలతో తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి ప్రచారం నిర్వహించింది. ముఖ్యమంత్రి 2 రోజులపాటు ప్రచారం నిర్వహించారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ ఏకంగా 13 రోజుల పాటు నంద్యాలలోనే మకాం వేసి మరీ రోడ్ షోలు నిర్వహించారు. గ్రామాల్లో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.


ప్రచార హోరు ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. మొత్తం 2,18,852 మంది ఓటర్లున్న నంద్యాల నియోజకవర్గంలో 110 పోలింగ్ కేంద్రాలు, 255 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే దేశంలోనే తొలిసారిగా EVM యంత్రాలతో పాటు VVPAT మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఓటు వేసిన తరువాత ఓటు ఎవరికి పడిందో తెలియజేసేలా రశీదు వస్తుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గంలో ఓటర్లకు VVPAT మిషన్లపై అవగాహన సదస్సులు నిర్వహించారు.


నియోజకవర్గంలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను అధికారులు గుర్తించారు. సుమారు 2వేల మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో 71 సమస్యాత్మక, 104 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు 20 మంది ఆర్డీవోలను ప్రత్యేక అధికారులుగా ఎన్నికల కమిషన్ నియమించింది. ప్రతి గ్రామానికో ఒక MRO స్థాయి అధికారిని బాధ్యులను చేసింది. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పోలీసు శాఖ సిద్ధం చేసింది. కర్నూలు జిల్లాతో పాటు కడప, అనంతపురం జిల్లాల నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు నంద్యాలకు చేరుకున్నాయి.


ఎన్నికల ప్రచార హోరు ముగియడంతో పోలింగ్ ప్రక్రియకు అధికారులు సిద్ధమయ్యారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లకు VVPAT మిషన్లపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: