నంద్యాల బైపోల్ : ఓటరునాడి పట్టడంలో పార్టీలు బిజీబిజీ

Vasishta

          నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు కూడా భారీగా తరలివచ్చి ఓటింగ్ నమోదు చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉండడంతో వారి అంతరంగం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. భారీ పోలింగ్ తమకే అనుకూలిస్తుందని టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఫీల్ అవుతున్నాయి.


          నంద్యాలలో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటింగ్ భారీగానే నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి సుమారు 70 శాతం వరకూ పోలింగ్ నమోదైనట్టు అంచనా. సాయంత్రానికి 90 శాతం వరకూ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 73 శాతం దాటితే చాలు.. ఇదే అత్యధిక ఓటింగ్ నమోదైన ఎన్నికగా రికార్డు సృష్టిస్తుంది.


          నంద్యాల పట్టణంలోనే సగానికి పైగా ఓటర్లుండగా మిగిలినవాటిలో గోస్పాడు మండలం చాలా కీలకం. ఇప్పటివరకూ గోస్పాడు మండలంలో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. అంతేకాక.. మొదటి నుంచి గోస్పాడు మండలం భూమా కుటుంబానికి అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో గోస్పాడులో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు కావడం తమకే అనుకూలిస్తుందని టీడీపీ బలంగా నమ్ముతోంది. గోస్పాడుతో పాటు గ్రామీణప్రాంతంలోని ఓట్లలో భారీ పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది.


          నంద్యాల పట్టణంలో ముస్లింలు ఎక్కువ. పట్టణంలో వైసీపీకి మంచి పట్టుంది అంటున్నారు. అయితే పట్టణంలో పోలింగ్ గ్రామీణప్రాంతాల్లో జరుగుతున్నంతగా సాగట్లేదు. దీంతో వైసీపీ శ్రేణులు ఓటర్లను పోలింగ్ బూత్ లకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో పోలింగ్ ఎక్కువగా నమోదైతే అది తమకు లాభిస్తుందని వైసీపీ భావిస్తోంది. అయితే.. పట్టణంలో ఇటీవల తాము పెద్దఎత్తున గృహనిర్మాణాలు చేపట్టామని, ఓటర్లు తమకే ఓటేస్తారని టీడీపీ కూడా అంచనా వేస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: