వచ్చే ఎన్నికల్లో కడపలో హాట్ ఇష్యూ ఏంటో తెలుసా..?

Vasishta

కడప పేరు వింటే చాలు కాస్త అటెన్షన్ పెరుగుతుంది. రాజకీయంగా కానీ, ఇంకే విషయంలో కానీ ఆ పేరు వినిపిస్తే.. ఏం జరిగిందో ఆరా తీస్తుంటారు.. ఆసక్తిగా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. రాజకీయ రణరంగానికి కడప ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో కూడా కడపపై అధికార, ప్రతిపక్షాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ అంశం కడపలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేంటో తెలుసా..?


                కడప జిల్లాలో ఇప్పుడు మార్మోగుతున్న ఒకే నినాదం కడప ఉక్కు – ఆంధ్రుల హక్కు. అవును.. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధనకోసం జిల్లా మొత్తం ఏకమైంది. అధికార పార్టీలు మినహా మిగిలిన అన్ని పార్టీలూ ఏకతాటిపైకి వచ్చేశాయి. ఇప్పటికో పోరాటం ఉధృతరూపం దాల్చింది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలించాలంటూ రాష్ట్ర విభజనచట్టంలో పేర్కొన్న విధంగా వెంటనే ఇక్కడ ప్యాక్టరీ స్థాపించాలనేది అన్ని పార్టీల డిమాండ్..


          కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ – ఆర్పీఎస్ వంద రోజుల పాటు దీక్ష చేయనున్నట్టు కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని పార్టీల మద్దతూ కోరింది. ఇప్పటికే దీక్షలు 68 రోజులు కంప్లీట్ చేసుకున్నాయి. దీక్షలు నిరాటంకంగా కొనసాగుతున్నా కూడా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.


          కడప ఉక్కు సాధనలో అందరూ కలసిరావాలనే డిమాండ్ తో వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కడపలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి. విభజనచట్టంలో పేర్కొన్న ఏ హామీనీ కేంద్రం అమలు చేయడం లేదని వైసీపీ, కాంగ్రెస్, వామపక్ష నేతలు ఆరోపించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ , కడప ఉక్కు.. ఇలా ఎన్నో హామీలు అందులో ఉన్నా కూడా మోదీ సర్కార్ చిత్తశుద్ది చూపించడంలేదని నేతలు ధ్వజమెత్తారు.


          ఇక రాష్ట్రంలోని చంద్రబాబు సర్కార్ లోటు బడ్జెట్ లో ఉందంటూనే హంగుఆర్భాటాలకు కోట్లకు కోట్లు ఖర్చు చేస్తోందని నేతలు ఆరోపించారు. చంద్రబాబుకు కడప ఉక్కుపై చిత్తశుద్ధి లేదని వైసీపీ ఆరోపించింది. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే కడప ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. అసలు కడప ఉక్కుపై టీడీపీ, బీజేపీలు తమ వైఖరి వెల్లడించాలని విపక్షాలన్నీ ముక్తకంఠంతో నినదించాయి.


          వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని ప్రధానంగా చేపట్టాలని పార్టీలన్నీ నిర్ణయించాయి. సుమారు 10వేల మందికి ఉపాధి కల్పించే ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా జిల్లా స్వరూపమే మారిపోతుందని.. కరువు ఛాయలు దూరమవుతాయని నేతలు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా టీడీపీ, బీజేపీలను ఇరుకున పెట్టాలని వ్యూహరచన చేస్తున్నాయి. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: