హెల్మెట్ ఉంటేనే..పెట్రోల్ లేదంటే బంద్..!

Edari Rama Krishna
భారత దేశంలో గత కొన్ని రోజులుగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోడ్డు భద్రతా చర్యలు కఠినంగా తీసుకుంటుంది.  తాజాగా రోడ్డు ప్రమాదాల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను తీసుకొంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను తీసుకొంటుంది. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా అమలు చేసే నిమిత్తం ఏపీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టనున్నారు. హెల్మెట్ ధరించిన వారికే బంకుల్లో పెట్రోల్ విక్రయించేలా చర్యలు తీసుకోనున్నారు.

ఈ మేరకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్ లో తనిఖీలు మరింత పెంచుతామని హెచ్చరించారు.  అత్యధిక ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైకులపై యువత మోజు పెరిగిందని, విజయవాడలో చాలా మంది యువకుల వద్ద ఇవే బైకులు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి స్పీడ్ బైకులతో రేసింగ్స్ నిర్వహిస్తున్నారని, వాటిపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు.  

ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గౌతం సవాంగ్.  చిత్తూరు జిల్లాలో పోలీసులు పెట్రోలు బంకుల యజమానులతో మాట్లాడి ఈ విధానాన్ని తీసుకొచ్చారని, విజయవాడలో కూడా కొద్ది రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. గత కొన్ని రోజులుగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నామని దీని వల్ల 70 శాతం మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తున్నారని అన్నారు.  

రాబోయే రోజుల్లో హెల్మెట్‌ ధరించాలన్న నిబంధనను కఠినతరం చేస్తామన్నారు. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ప్రజల భద్రత, వారి విలువైన ప్రాణాలను కాపాడేందుకు అందరూ హెల్మెట్ ధరించేలా చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: