ఎడిటోరియల్: పుట్టా సుధాకర్ యాదవ్ క్రైస్తవ సభలకు వెళితే తప్పా..? క్రైస్తవుడైన జగన్ హిందూ ఆలయాలకు వస్తే రైటా..?

Vasishta

తిరుమల తిరుపతి దేవస్థానముల ఛైర్మెన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ఖరారైనట్టు సమాచారం అందుతోంది. అయితే ఆయన క్రిస్టియన్ సంస్థలతో సన్నిహితంగా ఉంటారని, అలాంటి వ్యక్తిని టీటీడీ ఛైర్మన్ గా ఎలా నియమిస్తారని పలువురు హిందూ ఆధ్యాత్మిక గురువులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన తప్పేంటి..?


          పుట్టా సుధాకర్ యాదవ్.. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత. యాదవ కులానికి చెందినవారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కూడా..! అనేక సంప్రదింపులు, చర్చల అనంతరం పుట్టా సుధాకర్ యాదవ్ ను టీటీడీ ఛైర్మెన్ పదవికి ఓకే చేశారు చంద్రబాబు. అయితే ఆయనపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


          పుట్టా సుధాకర్ యాదవ్ కు క్రైస్తవ సంస్థలతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన్ను టీటీడీ ఛైర్మన్ గా నియమించవద్దని పలువురు కోరుతున్నారు. ఇందుకు క్రైస్తవ సమావేశాలకు హాజరు కావడమే.! ఇదే ఆయన చేసిన పెద్ద తప్పు. మైదుకూరు నియోజకవర్గంలో క్రైస్తవులు ఓ సమావేశం నిర్వహించారు. దానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతమాత్రానికే ఆయన హిందూ వ్యతిరేకి అయిపోయారు.


          రాజకీయ నాయకులు అన్ని మతాలు, కులాల సమావేశాలకు వెళ్లడం చాలా కామన్. పుట్టా సుధాకర్ యాదవ్ క్రైస్తవుడు కాదు. క్రైస్తవ మతం స్వీకరించలేదు. హిందువుగానే ఉన్నారు. రాజకీయనాయకుడు కాబట్టి క్రైస్తవులు ఆయన్ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.. ఆయన కూడా వెళ్లారు. అంతమాత్రానికి ఆయన హిందువు కాకుండా పోయారు. అంతేకాక.. టీటీడీ ఛైర్మన్ పదవికి పనికిరాకుండా పోయారు. ఇది వినడానికి చూడ్డానికి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది.


          వై.ఎస్. కుటుంబం క్రైస్తవాన్ని పాటిస్తుందనే సంగతి తెలిసిందే. అదే సమయంలో గుళ్లు, గోపురాలకు వెళుతుంటారు. నవంబర్ 2 న పాదయాత్ర ప్రారంభించే ముందు జగన్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. క్రైస్తవడైన జగన్.. హిందూ దేవాలయాలకు వెళ్తే తప్పు లేదు కానీ, క్రైస్తవ సమావేశానికి పుట్టా సుధాకర్ యాదవ్ అతిథిగా వెళ్తే మాత్రం తప్పయిపోయింది. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: