ఆంధ్రా అసెంబ్లీకి ఏమైంది..!? వాస్తు దోషం ఉందా..?

Vasishta

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక అసెంబ్లీని వెలగపూడిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యంత ఆధునిక అసెంబ్లీ ఇదే. అయితే దీనికీ వాస్తుదోషం ఉందని తేలింది. అందుకే దీని గోడ కూల్చి మరో గేటు ఏర్పాటు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియేట్ తో పాటు అసెంబ్లీని అత్యాధునిక హంగులతో నిర్మించారు. కేవలం ఏడాదిలోనే వీటిని పూర్తి చేయడం ఓ రికార్డ్ గా భావించారు. ఇవి పూర్తయిన తర్వాత హైదరాబాద్ నుంచి పాలనను పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అయితే అసెంబ్లీ నిర్మాణం కాస్త ఆలస్యమైంది. ఆ తర్వాత అది కూడా పూర్తి కావడంతో దాన్ని కూడా వెలగపూడికి షిఫ్ట్ చేశారు.

సెక్రటేరియేట్ ప్రాంగణంలోనే అసెంబ్లీని నిర్మించారు. సెక్రటేరియేట్ బ్లాకులతో సంబంధం లేకుండా అసంబ్లీకి ప్రత్యేక ప్రహరీ ఏర్పాటు చేశారు. పడమర వైపున మినహా.. మిగిలిన మూడు దిక్కులా ఐదు గేట్లను అసెంబ్లీకి ఏర్పాట్లు చేశారు. ఇందులో తూర్పు వైపున్న గేట్లను వినియోగించకుండా ఉత్తర., దక్షిణ మార్గాలను మాత్రమే వాడుతున్నారు.

అయితే ఇప్పుడు అసెంబ్లీకి వాస్తుదోషమున్నట్టు తెరపైకి వచ్చింది. దీంతో పడమర వైపున.. అంటే సీఎం కార్యాలయం ఉన్న ఫస్ట్ బ్లాక్ కు ఎదురుగా ఓ గేటును ఏర్పాటు చేస్తున్నారు. ఇది సీఎం కార్యాలయానికి అభిముఖంగా ఉంటుంది. ఈ గేటు ఏర్పాటుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వాస్తు దోషం ఉన్నందు వల్లే మరో గేటును ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యాలయ వర్గాలు వెల్లడిస్తుండగా.. సీఆర్డీఏ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. కేవలం సౌలభ్యం కోసమే మరో గేటు ఏర్పాటు చేస్తున్నామంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: