గవర్నర్ టీఆర్ఎస్ కార్యకర్తా..? కేసీఆర్ తొత్తులా వ్యవహరిస్తున్నారా..?

Vasishta

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యవహార శైలి ఇటీవలికాలంలో వివాదాస్పదమవుతోంది. రాష్ట్రం విడిపోక ముందు నుంచే నరసింహన్ గవర్నర్ గా ఉన్నారు. విడిపోయిన తర్వాత కూడా ఆయనే కొనసాగుతున్నారు. అయితే ఆయన ఓ పార్టీకి, ఓ రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి.


          ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజ్ భవన్ లేకపోవడంతో ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంతో ఎక్కువగా ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా వారం, పదిరోజులకోసారి గవర్నర్ ను కలిసి ముచ్చట్లాడి వస్తున్నారు. దీంతో వారిద్దరి మధ్య సఖ్యత పెరిగింది.


          ఇటీవల రైతులపై దాడులకు సంబంధించి విపక్షాలన్నీ గవర్నర్ ను కలిస్తే.. ఆయన సమస్యపై స్పందించాల్సింది పోయి.. విపక్ష నేతలనే తిట్టి పంపించారనే వార్తలు వచ్చాయి. అప్పుడు మీరు అలా చేసారు కదా.. అలా జరగడంలో తప్పేముంది.. లాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలిసింది. గవర్నర్ తీరు చూసి అక్కడికి వెళ్లిన నేతలంతా ముక్కున వేలేసుకున్నారు.


          రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి బయటికి వచ్చన తర్వాత నేతలంతా ఆయన తీరును తప్పుబట్టారు. ఆయన కేసీఆర్ తొత్తుగా మారారాని దుయ్యబట్టారు. తాజాగా.. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా గవర్నర్ తీరును గర్హించారు. ఆయన టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు మినహా మిగిలినవాళ్లంతా నరసింహన్ తీరును తప్పుబడుతున్నారు.


          ఇక.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు కూడా గవర్నర్ తీరును తప్పుబడుతున్నారు. హైదరాబాద్ లో ఇక్కడి నేతలు కనిపించిన ప్రతిసారి.. ఇంకెంతకాలం ఉంటారు హైదరాబాద్ లో.. అమరావతి వెళ్లరా.. అని నిలదీస్తున్నారట గవర్నర్. దీన్ని ఏపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మేం ఎక్కడుంటే ఆయనకేంటి.. ఆయనకెందుకు అని ఇంటర్నల్ గా గొణుక్కుంటున్నారు. కొంతమంది నేతలైతే నేరుగా చంద్రబాబును కలిసి గవర్నర్ పై ఫిర్యాదు చేశారట. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని.. అక్కడుంటే హక్కు మనకుంది. అయినా గవర్నర్ మాత్రం టీఆర్ఎస్ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు అని ఫిర్యాదు చేశారట. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: